పిక్‌ ఆఫ్‌ ది డే.. తులసమ్మకు జేజేలు!!

Tulsi Gowda: Environmentalist Whose Pic Receiving Padma Shri Went Viral - Sakshi

ఆకట్టుకున్న తులసి గౌడ, హజబ్బ సింప్లిసిటీ

నిరాడంబరంగా పద్మ అవార్డుల స్వీకరణ

ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు

‘పిక్చర్‌ ఆఫ్‌ ది డే’ అంటూ ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో నెటిజనులు షేర్‌ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన పద్మ పురస్కారాలు ప్రదానోత్సవం సందర్భంగా తీసిన చిత్రమిది. ప్రత్యేక వస్త్రాలంకరణతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అవార్డు అందుకోవడానికి వెళుతున్న వృద్ధురాలికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తుండడం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు తులసి గౌడ. సామాజిక సేవ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 


అటవీ విజ్ఞాన సర్వస్వం

కర్ణాటకకు చెందిన 73 ఏళ్ల తులసి గౌడ.. అడవుల్లోని సమస్త జీవజాతుల గురించిన తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా ప్రఖ్యాతి గాంచారు. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిక్షరణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 30 వేలకు పైగా మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ ఆమె ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. (చదవండి: పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు)


సింప్లిసిటీకి జేజేలు
పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి దేశరాజధాని ఢిల్లీకి వచ్చిన తులసి గౌడ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా తనకు అలవాటైన వస్త్రాధారణనే కొనసాగించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి నిరాడంబరంగా వచ్చిన ఆమెను చూసి ప్రధాని మోదీ సహా ఇతర మంత్రులు, ఉన్నత అధికారులు వినమ్రంగా నమస్కరించారు. తులసి గౌడ నిరాడంబరతకు నెటిజనులు సైతం జేజేలు పలుకుతున్నారు. ఆమె ఫొటోలను సోషల్‌ మీడియాలో విరివిగా షేర్‌ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. 


శభాష్‌.. హజబ్బ!

కాగా,  కర్ణాటక రాష్ట్రానికే చెందిన హరేకల హజబ్బ కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అక్షరం ముక్క రాని హజబ్బ ఎంతోమంది పిల్లలకు చదువుకునే భాగ్యం కల్పించారు. మంచి పనికి పేదరికం అడ్డుకాదని ఆయన నిరూపించారు. పళ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న హజబ్బ.. సొంతిల్లు కూడా కట్టుకోకుండా తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల కట్టించారు. పద్మ అవార్డుతో వచ్చిన 5 లక్షల రూపాయలను కూడా స్కూల్‌కే ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు. నెటిజనులు ఆయనకు కూడా సలాం చేస్తున్నారు! (Harekala Hajabba: అవమానం నుంచి పుట్టిన ఆలోచన..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top