పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు

Padma Awards To Three People From Andhra Pradesh - Sakshi

పద్మభూషణ్‌ అందుకున్న ముంతాజ్‌ అలీ, పీవీ సింధు

‘పద్మశ్రీ’ స్వీకరించిన యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావు 

పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె సిటీ(చిత్తూరు జిల్లా)/రాజాం: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 2020వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 141 పురస్కారాలను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. ఇందులో మొత్తం 33 మంది మహిళలున్నారు.  

ఏపీ నుంచి ముగ్గురు.. 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు ‘పద్మ’ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులు, సత్సంగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ పద్మభూషణ్‌ పురస్కారాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు, అనంతపురం జిల్లాకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దాళవాయి చలపతిరావు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి, సంస్కృత వాచస్పతిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు పాల్గొన్నారు. 

అందరి సంతోషం కోసం.. ముంతాజ్‌ 
పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న ముంతాజ్‌ అలీ కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 19 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లారు. అక్కడ మధుకర్‌నాథ్‌తో ఏర్పడిన పరిచయం ద్వారా వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవడంతో పాటు «ధ్యానం, క్రియా యోగాల్లో శిక్షణ తీసుకున్నారు. 1996లో చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. 2015లో వాక్‌ ఆఫ్‌ హోప్‌ యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు యాత్ర చేశారు. నక్కలదిన్నె సమీపంలో సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. యోగా, ధ్యానంపై ప్రచారం చేస్తూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దేశవిదేశాల్లో సత్సంగ్‌ ఆధ్యాత్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశయంతో ముంతాజ్‌ అలీ పనిచేస్తున్నారు. 

కళే.. ఇంతవాడిని చేసింది 
పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. నాకు పురస్కారాలు, సత్కారాలు వస్తాయని ఏనాడూ అనుకోలేదు. నా జీవనం కోసం కళను నమ్ముకున్నాను. ఆ కళే నన్ను ఇంతవాడిని చేసింది. నక్షత్రక పాత్రే నాకు ఇంతటి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. నాలో ఉన్న నటుడిని.. నా గురువు యడ్ల సత్యంనాయుడు ప్రపంచానికి పరిచయం చేస్తే, నాకు అన్ని విధాలా నా భార్య జయమ్మ సహకరించింది. మందరాడ గ్రామ ప్రజలంతా నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. బాలభారతి కళా నాట్యమండలికి, కుటుంబీకులకు, తోటి కళాకారులకు, మందరాడ గ్రామస్తులకు ఈ పురస్కారం అంకితం. – పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top