భగ్గుమన్న దేశ రాజధాని.. ఉద్రిక్తం

Tractor set on fire at India Gate during protest against farm bills - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వ్యవసాయం బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌, హర్యానాతో పాటు రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌లోనూ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నిరసనల సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్‌ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ బిల్లును నిరశిస్తూ ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను సైతం కాలబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. (రైతన్న యుద్ధభేరి.. ఏమైనా జరగొచ్చు)

పంజాబ్‌ ముద్దబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి నాడు రైతులు రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏ‍ర్పడటం దురదృష్టకరమన్నారు. పంజాబ్‌ యూత్‌ కాం‍గ్రెస్‌ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్‌ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్‌సర్‌– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. (ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం)

ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు  ఎగసిపడుతున్నా.. రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020.లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడు బిల్లులను ఆమోదించారు. మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాని కాంగ్రెస్‌ పార్టీ దేశంలోని ప్రధాన పార్టీలను కోరింది. వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్‌డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్‌ కోరింది. ఈ మేరకు ఆదివారం లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top