భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం!

Tourist Attraction Spot Deomali Mountain Odisha - Sakshi

కొరాపుట్‌(భువనేశ్వర్‌): పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న దేవమాలి పర్వతం కొరాపుట్‌ జిల్లాకు మరింత వన్నె తెస్తోంది. పొట్టంగి సమితి కొఠియా సమీపంలోని ఈ పర్వతాన్ని చేరుకునేందుకు రోడ్డుమార్గం, ఇతర సదుపాయాలు ఉన్నాయి. కుందిలి సంత నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ఎత్తయిన ఈ శిఖరం ఉంది. సముద్ర మట్టానికి 1,762 మీటర్లు ఎత్తులో నిలిచిన ఈ పర్వతం, 1996 తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. 2018లో 29,350 మంది, 2019లో 29,950 మంది పర్యాటకులు సందర్శించినట్లు పర్యాటక విభాగం తెలిపింది. కరోనా కారణంగా 2020లో పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినా(9765 మంది), 2021లో ఇప్పటివరకు 14,688 మంది  సందర్శించినట్లు పర్యాటక విభాగం అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య )

దినదిన ప్రవర్ధమానంగా..
సిమిలిగుడకి చెందిన సాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ యువజన సంస్థ నిర్వహించిన పర్వతారోహణతో దేవ్‌మాలి పర్వతం బాహ్య ప్రపంచానికి పరిచయమైంది. ప్రస్తుత భువనేశ్వర్‌ ఎంపీ అపరాజితా షడంగి.. కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌గా(2000సంవత్సరం) పనిచేసిన సమయంలో దేవ్‌మాలి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శిఖరానికి చేరుకొనేందుకు రహదారి నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఐదు టవర్లు నిర్మించారు. 2001లో కొరాపుట్‌ జిల్లా సాంస్కృతిక ఉత్సవం పరభ్‌ ఇక్కడే ప్రారంభమైంది.

దీంతో పర్వతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. 2004–05లో దమంజోడిలోని భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) ఈ పర్వతం అభివృద్ధికి రూ.35 లక్షలు మంజూరు చేసింది. పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, వ్యూ పాయింట్, త్రాగునీటి సదుపాయం, స్విమ్మింగ్‌ ఫూల్‌ నిర్మించారు. ఆపై పర్యాటక విభాగం, అటవీ శాఖ, ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో దేవ్‌మాలి ప్రాంతం అభివృద్ధి చెందింది. గత ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చే పర్యాటకులలో అధిక శాతం మంది దేవ్‌మాలిని సందర్శించడం విశేషం. 

అభివృద్ధికి మరిన్ని నిధులు
పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న దేవ్‌మాలి పర్వతం అభివృద్ధికి డీపీఎం నుంచి రూ.1.25 కోట్లు, పర్యాటక విభాగం నుంచి రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అక్తర్, పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతం పాడి, కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్క దేవ్‌మాలిని  సందర్శించి, పర్వతం అభివృద్ధికి నిధుల వినియోగింపై సమీక్షించారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో పొట్టంగి వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి, టికెట్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం వినియోగించాలని నిర్ణయించారు.

చదవండి: టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top