దేవుడా.. ఎంతపని చేశావయ్యా | three dies in road accident | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఎంతపని చేశావయ్యా

Jul 1 2025 11:52 AM | Updated on Jul 1 2025 12:54 PM

three dies in road accident

బాగేపల్లి(కర్ణాటక): తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబాలు కొంతసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు అక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో  కురబలకోట వద్ద చెన్నామర్రి మిట్ట అనేచోట  హైవేలో సోమవారం ఉదయం జరిగింది. బాగేపల్లి తాలూకాలోని శ్రీనివాసపుర (సాకోళ్ళపల్లి ) గ్రామానికి చెందిన శ్రావణి (27), హోసహుడ్యకు చెందిన హెచ్‌.ఎస్‌.చరణ్‌ (17), బాగేపల్లి పట్టణవాసి మేఘర్శ (17) మృతులు.  

అంతా భీతావహం  
వివరాలు.. బాగేపల్లి పట్టణంలోని గంగమ్మగుడి రోడ్డుకు చెందిన రామచంద్రప్ప, హెచ్‌.టి.శివప్ప, నరసింహరెడ్డి కుటుంబాలకు చెందిన 13 మంది కలిసి టెంపో ట్రావెలర్‌లో తిరుమల యాత్రకువెళ్లారు. దర్శనాలయ్యాక బయల్దేరారు. ఘటనాస్థలంలో యమ శకటంలా వచ్చి­న భారీ లారీ ఈ టెంపోను ఢీకొట్టింది. టెంపో పూర్తిగా ధ్వంసమైంది. లోపలున్నవారు విసిరేసినట్లు బయటకు పడిపోయారు. అందరికీ తీవ్ర రక్త గాయాలయ్యాయి.

 ముగ్గురు అక్కడే మరణించారు. నరసింహారెడ్డి, భార్య హెచ్‌.ఎన్‌. రూప,  కుమారుడు ఆదర్శ, రామచంద్రప్ప, భార్య కళావతి, పెద్ద కుమారుడు అశోక్, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు దర్శన్, టైలర్‌ హెచ్‌.టి.శివప్ప, భార్య సునందమ్మ, కుమార్తె చైత్ర, టెంపో డ్రైవర్‌ మంజునాథ్‌లు గాయపడ్డారు. రక్తగాయాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలి భ­యంకరంగా కనిపించింది. స్థానికులు గాయపడినవారికి  దొరికిన వాహనాలలో ఆస్పత్రులకు తరలించారు.  కొందరిని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలియగానే ఇక్కడి నుంచి బంధువులు వెళ్లారు.

దేవుడా..ఎంతపని చేశావయ్యా
కురబలకోట: దేవుడా నీ దర్శనానికి వచ్చామే, ఎంత పనిచేశావయ్యా అని గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు,  ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.   

ఢీకొన్న లారీ ఎక్కడ?  
టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్‌ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్‌ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రూరల్‌ సర్కిల్‌ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.  

టాప్‌తో సహా లేచిపోయింది  
టెంపో ట్రావెలర్‌కు జరిగిన ప్రమాదం చూస్తే భయాందోళన కలగడం ఖాయం. లారీ ఢీకొన్న ధాటికి టెంపో టాప్‌ ఎగిరిపోయింది. బాధితులు తీవ్ర గాయాలతో అంగలార్చడం చూపరులను చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు.  

ఈ ఇద్దరూ క్షేమం  
టెంపో డ్రైవర్‌ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్‌ (32), ఇతని వెనుక సీట్లో ఏడో తరగతి విద్యార్థి హేమంత్‌ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమలలో గుండు చేయించుకున్నాడు. ఈ యాక్సిడెంట్‌లో వీరిద్దరే క్షేమంగా బయటపడడం విశేషం. డ్రైవర్‌ మంజునా«థ తీవ్ర గాయాలతో కోమాలో ఉన్నాడు.  

దర్శనం తరువాత బయల్దేరాం  
ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాం. కొంత సేపు విశ్రాంతి తీసుకుని సోమవారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో బయలు దేరాం. కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద వస్తుండగా ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – ఓ క్షతగాత్రుడు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement