
ముగ్గురు విద్యార్థులు మృత్యువాత
తమిళనాడులోని కడలూర్‌లో ఘటన
కడలూర్: పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో విద్యార్థి, వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కడలూరు–అలప్పక్కం రైలు మార్గంలో 170వ నంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద మంగళవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులున్న ఆ వ్యాను పల్టీలు కొట్టింది. అనంతరం విల్లుపురం–మైలాదుతురై ప్యాసింజర్ రైలును డ్రైవర్ నిలిపివేశారు. నుజ్జునుజ్జయిన వ్యానులోంచి స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు.
ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. వ్యాను డ్రైవర్, 12వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూలుకు ఆలస్యమవుతుందని, గేట్ తెరిచే ఉంచాలని వ్యాన్ డ్రైవర్ ఒత్తిడి చేయడం వల్లే గేటును తెరిచి ఉంచానని గేట్ కీపర్ అంటుండగా, తాము వచ్చేసరికే గేటు ఓపెన్ చేసి ఉందని వ్యాన్ డ్రైవర్, క్షతగాత్రుడైన విద్యార్థి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ గేట్ కీపర్‌పై కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు. కాగా, స్కూలు విద్యార్థులను బయటకు తీసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తెగిన విద్యుత్ తీగను తాకి షాక్‌కు గురయ్యారు.
అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై రైల్వే శాఖ ప్రజలను క్షమాపణ కోరింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.