రూ.110 కోట్ల స్కాం.. వారికేం తెలియదు | Sakshi
Sakshi News home page

తమిళనాడులో వెలుగు చూసిన భారీ కుంభకోణం

Published Wed, Sep 9 2020 1:11 PM

Tamil Nadu Rs 110 Crore Scam in PM Kisan Scheme Unearthed - Sakshi

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది. పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకంలో భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. కొందరు స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో కలిసి దాదాపు 110 కోట్ల రూపాయలకు పైగా మోసపూరితంగా డ్రా చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గగన్‌దీప్ సింగ్ బేడి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆగస్టులో ఈ పథకానికి అనూహ్యంగా అధిక సంఖ్యలో జనాలు చేరారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్ దరఖాస్తు ఆమోద విధానం ద్వారా అనేక మంది లబ్ధిదారులను చట్టవిరుద్ధంగా చేర్చారని దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ అధికారులు ఏజెంట్లకు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ని ఇచ్చి కొత్త లబ్ధిదారులను చేర్చి వారి పేరుతో అదనంగా 2వేల రూపాయలు పొందినట్లు గుర్తించాము’ అన్నారు. (చదవండి: ప్రారంభమైన ‘కిసాన్‌ రైలు’)

ఇందుకు సంబంధించి వ్యవసాయ పథకాలతో సంబంధం ఉన్న 80 మంది అధికారులను తొలగించాము, మరో 34 మందిని సస్పెండ్ చేశామని తెలిపారు బేడి. ఏజెంట్లుగా గుర్తించిన పద్దెనిమిది మందిని అరెస్టు చేశాము. మొత్తం 110 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది అన్నారు. రాబోయే 40 రోజుల్లో మిగిలిన డబ్బును తిరిగి తీసుకుంటాము అని తెలిపారు బేడి. రాష్ట్రంలోని కల్లకూరిచి, విల్లుపురం, కడలూరు, తిరువన్నమలై, వెల్లూరు, రాణిపేట, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, చెంగల్‌పేట జిల్లాలు ఈ కుంభకోణం కొనసాగుతున్నాయి. ఈ పథకంలో చేర్చిన కొత్త లబ్ధిదారులకు చాలా మందికి దీనికి గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడం గమనార్హం. 

ఆగస్టు చివరి వారంలో, ప్రధాన మంత్రి కిసాన్ పథకం నిధుల పంపిణీలో అవినీతికి పాల్పడ్డారంటూ కలకూరిచికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. రైతులు కానివారికి ఈ పథకం నుండి నిధులు ఇవ్వడంపై ఫిర్యాదు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Advertisement
Advertisement