చెన్నై: తమిళనాడులో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీతో తన అనుబంధాన్ని ముగించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 18 నెలలుగా పార్టీ హైకమాండ్‌తో పలు అంశాలపై తనకు విభేదాలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీపై గౌరవం ఉంది కానీ.. అభిప్రాయ బేధాల కారణంగానే తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను కొత్త రాజకీయ ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఒంటరిగా తన దారి తాను ఏర్పరచుకుంటానని స్పష్టం చేశారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాని అన్నారు. దీంతో, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మరాయి.
తాజాగా అన్నామలై రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నామలై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మార్పు కోసం బీజేపీలో చేరాను. బీజేపీ భవిష్యత్ కోసం ఎంతో కృషి చేశాను. సమాజంలో మార్పు తేవాలని భావించాను. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. అభిప్రాయ బేధాల కారణంగా బీజేపీ నుంచి బయటకు వచ్చాను. 2025 డిసెంబర్‌లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పాను. ఎన్నికల తర్వాత వెళ్లాలని బీజేపీ అధిష్టానం చెప్పింది.
గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతృత్వంతో అనేకసార్లు చర్చలు జరిపాను. నా అభిప్రాయ భేదాలను స్పష్టంగా వివరించాను. అయితే తమిళనాడులో పార్టీ భవిష్యత్ దిశపై మా అభిప్రాయాలు ఒకేలా లేవని చివరకు అర్థమైంది. తమిళనాడు ప్రజలు అర్థం చేసుకునే భాషలో జాతీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అభివృద్ధి కేంద్రిత, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే రాజకీయాల అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తాను. అందులో భాగంగా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. సామాన్యులకి నా పార్టీలో ప్రాధాన్యం ఇస్తాను. రాజకీయాల్లో కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదు.
After resigning from the BJP, K Annamalai says, "Today, we are going to start a movement. Our political party will contest in the next assembly election in Tamil Nadu." pic.twitter.com/RtWoJQ5LUQ
— ANI (@ANI) June 5, 2026
రాజకీయాల్లోకి వచ్చే ముందు రజినీకాంత్ సలహాలు తీసుకున్నాను. రజినీకాంత్‌ను నాతో కలిసి రావాలని కోరాను. ఇక రాజకీయ ఉద్యమం మొదలుపెడుతున్నాను. ఒంటరిగా నా దారి నేను ఏర్పరచుకుంటాను. తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోలేను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. తమిళనాడు అభివృద్ధే నా ప్రధాన లక్క్ష్యం. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాను’ అని తెలిపారు. దీంతో, అన్నామలై వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యూహంపై, అలాగే దక్షిణాదిలో పార్టీ విస్తరణపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


