తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలలు కూడా లేవు. అక్కడి రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార, ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు.. వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా.. ఈ ఎన్నికల్లో మూడో పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ ‘తమిళగ వెట్రి కగళం’ పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. అయితే.. కరూర్ ఘటన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు.
నెల రోజులు(డిసెంబర్ 18 నుంచి) గడుస్తున్నా విజయ్ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. డీఎంకే సర్కార్‌పై రెగ్యులర్ తరహా విమర్శలు సహా తిరుపరంకుండ్రం తీర్పులాంటి అంశంపై కూడా స్పందించలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా ఆయనలో చలనం లేదు.(ఆ సంగతి నిర్మాతలే చూసుకుంటారని ఆయన అన్నట్లు వినికిడి). అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు సెన్సార్‌బోర్డు తీరును ఎండగడుతున్నా.. టీవీకే మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా ఈ మధ్యలో విజయ్ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ సైలెన్స్ ఏంటి అన్నా? అంటూ అభిమానులే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ సైలెన్స్‌లోనే..
అయితే ఆయన తన పనిని తాను సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారంటూ విశ్లేషణ నడుస్తోందక్కడ. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం.
మరోవైపు.. పొంగల్ తర్వాత మొన్నీమధ్యే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.
ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకంలో తేడాలు వస్తుండడంతో డీఎంకేకు కాంగ్రెస్ దూరం కావొచ్చని.. విజయ్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని గత కొంతరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ ఘటన, జన నాయగన్ సెన్సార్ విషయంలో రాహుల్ గాంధీ నేరుగా టీవీకేకు, విజయ్‌కు మద్దతు ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే టీవీకే కీలక నేతలు మాత్రం పొత్తులపై ఎక్కడా నోరు జారడం లేదు.
కొత్త కష్టం..
టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఎన్నికల సంఘం (ECI) వద్ద ఒకే గుర్తు (common symbol) కోసం దరఖాస్తు చేసింది. అయితే కామన్ సింబల్ దక్కకపోవచ్చనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
‘‘మాకు ఒకే గుర్తు తప్పనిసరి. లేకపోతే ఎన్నికల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేం ఇప్పటికే ఒక గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. త్వరలో దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ టీవీకే నేత ఒకరు చెబుతున్నారు.
ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. ఆర్‌యూపీపీ పార్టీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల అడిట్(Annual Audit Report), కాంట్రిబ్యూషన్ రిపోర్టు(Contribution Report)లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే టీవీకే మాత్రం ఒక్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను సమర్పించింది. అంటే.. రెండు సంవత్సరాల నివేదికలు అవసరం. అయితే..
కొన్ని పరిమితుల ప్రకారం టీవీకేకు కామన్ సింబల్ దక్కవచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీలు తాజా ఆర్థిక సంవత్సరపు నివేదికలు సమర్పిస్తే కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాంటి పార్టీలు సాధారణంగా లిస్ట్‌లో ఉన్న కామన్ సింబల్‌లలో ఒకటి పొందుతాయి. అయితే అది ఎప్పుడు, ఏది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే దరఖాస్తును ఈసీ త్వరలో పరిశీలించనుంది. నిర్ణయం ఏదనేది ఈ పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది.


