
హౌరా (పశ్చిమ బెంగాల్): బీహార్‌లో అమలు చేసిన ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పశ్చిమ బెంగాల్‌లోనూ అమలు చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కోటి మందికిపైగా రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు అక్రమంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు. హౌరాలో జరిగిన కన్యా సురక్ష యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తల మధ్య సువేందు అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ ఓటరు జాబితాలో మరణించిన ఓటర్లు, నకిలీ ఎంట్రీలు, నకిలీ ఓటర్లు, రోహింగ్యా వలసదారులు, బంగ్లాదేశ్ ముస్లిం ఓటర్లు ఉన్నారని, ఓటరు జాబితా విశ్వసనీయతను నిర్ధారించడానికి భారత ఎన్నికల సంఘం అక్రమ ఓటర్ల పేర్లను తొలగించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు.
కాగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను చేపట్టింది. తుది ముసాయిదాలో 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. పోల్ బాడీ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 24, 2025 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అయితే దానికి భిన్నంగా 7.24 కోట్ల గణన ఫారమ్‌లు (ఈ ఎఫ్)లు రావడం విశేషం. బీజేపీ ఆదేశాల మేరకే ఈ కసరత్తు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో ఈ వ్యవహారం వివాదాస్సదంగా మారింది. బీహార్ అసెంబ్లీ, పార్లమెంటులో దీనిపై తీవ్ర నిరసనలు జరిగాయి. కాగా బెంగాల్‌లో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ సువేందు రాష్ట్రంలో కన్యా సురక్ష యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.