
రేవంత్‌రెడ్డిపై దాఖలైన కేసు చెల్లుబాటు కాదు: ముకుల్ రోహత్గీ
అప్పట్లో రేవంత్ మా ప్రభుత్వాన్ని కూల్చేందుకుప్రయత్నించారు: ఆర్యమ సుందరం
విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై గతంలో దాఖలైన ‘ఓటుకు కోట్లు’కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ రెండు పిటిషన్లపై తాజాగా బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గతంలో బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి వారి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తొలుత వాదనలు వినిపించారు. అనంతరం రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ సుమారు గంటకుపైగా వాదనలు వినిపించారు.
ఏసీబీ కేసు అక్రమం: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై గతంలో దాఖలైన కేసు చెల్లుబాటు కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో ముందుగా రేవంత్‌రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిందని చెప్పారు. ఏసీబీ ట్రాప్ అక్రమమని పేర్కొన్నారు. 2015లో అమలుల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి లంచం ఇవ్వడం నేరం కూడా కాదన్నారు. తమ కేసు 2015లో దాఖలైనందున, ఆనాటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు.
మరోవైపు.. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మరోసారి తమ వైపు వాదనలు వినాలని బీఆర్‌ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. గురువారం వాదనల అనంతరం తీర్పును వెలువరించనుంది.