ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ | Supreme Court quashes HC order granting bail to 2 accused | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎన్నో రెట్లు ఎక్కువ

Published Sat, Mar 15 2025 5:21 AM | Last Updated on Sat, Mar 15 2025 6:12 AM

Supreme Court quashes HC order granting bail to 2 accused

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటించాల్సిందే 

కొందరి స్వలాభం కోసం ఇతరులు నష్టపోవడానికి వీల్లేదు  

సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

న్యూఢిల్లీ: దేశంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే వాటిని ఆశించే నిరుద్యోగులు ఎన్నో రెట్ల ఎక్కువగా ఉన్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితి ఇదేనని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఆయా ఉద్యోగాలు కచ్చితంగా అర్హులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలకు చోటు లేకుండా జాగ్రత్త వహించాలని స్పష్టంచేసింది.

 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను సంబంధిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయాలని, అక్రమ మార్గాలు అనుసరించకూడదని తేల్చిచెప్పింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టాలని పేర్కొంది. రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు పాటించకుండా రాజీపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజస్తాన్‌లో 2022లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టుల భర్తీ పరీక్ష నిర్వహించారు. 

ఈ పరీక్షలో ఓ సెంటర్‌లో ఒక అభ్యర్థి బదులు మరో అభ్యర్థి(డమ్మీ) హాజరైనట్లు తేలింది. ఇద్దరు అధికారుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఆ ఇద్దరు అధికారులు రాజస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్‌ మంజూరయ్యింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఆర్డర్‌ను సవాలు చేస్తూ రాజస్తాన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వును తోసిపుచ్చింది. 

రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఈ నెల 7వ తేదీన నిందితులను ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారని, వారికి అన్యాయం జరిగేలా ఎవరూ ప్రవర్తించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కొందరు స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులతో ఇతరులు నష్టపోవడానికి వీల్లేదని ఉద్ఘాటించింది. పోటీ పరీక్షల పారదర్శకతను దెబ్బతీయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement