దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ

Supreme Court panel to probe breach in PM Modi security in Punjab - Sakshi

ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు కొత్త కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్‌ రాష్ట్ర సర్కార్‌లు గతంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తులను నిలిపివేస్తూ కొత్త కమిటీని సుప్రీంకోర్టు కొలువు తీర్చనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత కేసు విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

చండీగఢ్‌ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇన్‌స్పెక్టర్‌ జనరల్, పంజాబ్‌– హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం పునరావృతం కాకుండా పటిష్ట రక్షణకు సూచనలు ఇచ్చేలా, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలంటూ లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.

కేంద్రం రాజకీయాలు చేస్తోంది
ఘటనపై పంజాబ్‌ ఉన్నతాధికారులను మోదీ సర్కార్‌ లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ డీఎస్‌ పట్వాలియా వాదించారు. ‘‘తప్పంతా పంజాబ్‌దే అని ఏకపక్షంగా తేల్చేస్తున్నారు. ఎలాంటి దర్యాప్తు, ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మొదలుకుని సీనియర్‌ ఎస్పీల వరకు మొత్తంగా ఏడు షోకాజ్‌ నోటీసులు పంపించారు. తప్పు మాదే అయితే నన్ను, మా రాష్ట్ర అధికారులను ఉరి తీయండి. మా వాదన వినకుండానే వైఫల్యానికి బాధ్యుతలు మీరే.. అని నిర్ధారించకండి. ఈ అంశంలో మోదీ సర్కార్‌ రాజకీయాలు చేస్తోంది’’ అని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు కమిటీని ఉద్దేశిస్తూ పట్వాలియా వ్యాఖ్యానించారు. వైఫల్యాలు తేలాలంటే స్వతంత్ర కమిటీ తప్పనిసరి అని ఆయన అన్నారు.

కోర్టు చేసేది ఏముంటుంది?: సుప్రీం
పట్వాలియా వాదనలను తోసిపుచ్చుతూ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. ‘దేశ ప్రధాని భద్రత అనేది అత్యంత కీలక అంశం. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్‌పీజీ) బ్లూ బుక్, ఇతర నియమావళి ప్రకారమే పంజాబ్‌ ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రధాని భద్రత ఎంత ముఖ్యమైన విషయమో మాకూ తెలుసు. దానికి తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నాం.

సంబంధిత అంశం కోర్టు పరిధిలోనే ఉంది. అలాంటపుడు షోకాజ్‌ నోటీసుల పేరిట రాష్ట్ర అధికారులపై మీరెందుకు క్రమశిక్షణ చర్యలకు బయల్దేరారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. మీరే దర్యాప్తు కొనసాగిస్తున్నపుడు మళ్లీ కోర్టుకెందుకు వచ్చారు. ఈ కోర్టు చేసేది ఏముంటుంది? ’అని తుషార్‌ మెహతాతో జడ్జీలు వ్యాఖ్యానించారు. మరోవైపు, వైఫల్యం ఘటనలో పంజాబ్‌ సీఎం, పంజాబ్‌ సీఎస్, డీజీపీ, ఫిరోజ్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీల పాత్రను బయటపెట్టేలా ఎన్‌ఐఏ అధ్యర్వంలో దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ లాయర్‌ వరుణ్‌ సిన్హా సుప్రీంకోర్టులో పిల్‌ వేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top