మీరు రద్దు చేస్తారా? మేము చేయాలా?

Supreme Court issues notice to UP govt over allowing Kanwar Yatra - Sakshi

కావడ్‌ యాత్రపై యూపీ సర్కార్‌కు సుప్రీం హుకుం  

న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన కావడ్‌ యాత్రపై పునరాలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం వరకు గడువు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మతపరమైన కార్యక్రమాలు ముఖ్యం కాదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మనందరం భారత పౌరులం. ఆర్టికల్‌ 21 జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. యూపీ సర్కార్‌ ఇలాంటి యాత్రలని 100శాతం నిర్వహించకూడదు’’అని వ్యాఖ్యానించింది.

ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మనోభావాలు ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ‘‘మీకు మరో అవకాశం ఇస్తున్నాం. యాత్రని ఆపేస్తారా, లేదంటే ఆపేయాలనే మేమే ఆదేశాలివ్వాలా?’’అని సూటిగా ప్రశ్నించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి గంగా జలాలను తమ ఊళ్లకి తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసే ఈ కావడ్‌ యాత్రకు కోట్లాదిగా భక్తులు హాజరవుతారు. కరోనా నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ దీనిని రద్దు చేసినా, యూపీ సర్కార్‌ ఆంక్షల మధ్య అనుమతులిచ్చింది. దీంతో దీనిని సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top