కోవిడ్‌ పేషెంట్లను అంటరాని వారిగా చూస్తున్నారు | Supreme Court Of India Comments About Covid-19 Victims | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ పేషెంట్లను అంటరాని వారిగా చూస్తున్నారు

Dec 2 2020 4:59 AM | Updated on Dec 2 2020 4:59 AM

Supreme Court Of India Comments About Covid-19 Victims - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 బాధితుల ఇళ్ల వద్ద అధికారులు పోస్టర్లు అంటిస్తుండటంతో ప్రజలు వారిని అంటరానివారిగా చూస్తున్నారనీ, క్షేత్ర స్థాయి పరిస్థితికి ఇది అద్దం పడుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారి పేర్లను బహిరంగ పరచడం, వారి ఇళ్ల వద్ద పోస్టర్లు అంటించడం వంటి చర్యల కారణంగా వ్యాధి బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కుష్‌ కల్రా అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనంపై విధంగా స్పందించింది.

కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారు, ఐసోలేషన్‌ ఉన్న వారి ఇళ్ల పోస్టర్లు వేయడం ఆపేయాలంటూ యంత్రాంగాన్ని ఆదేశిస్తామంటూ ఢిల్లీ ప్రభుత్వం నవంబర్‌ 3వ తేదీన హైకోర్టులో అంగీకరించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఇదే విధమైన నిబంధన అమలయ్యేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘కేంద్రం జారీ చేసిన నిబంధనావళిలో పోస్టర్లు వేయడం అనేది లేదు. కానీ, కొన్ని రాష్ట్రాలు ప్రజలను కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి పోస్టర్లు అంటిస్తున్నాయి’ అంటూ కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇలాంటి చర్యల వల్ల బాధితుల పట్ల చుట్టుపక్కల వారు వివక్ష చూపడం వంటివి జరుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement