
దర్యాప్తు కమిటీ నివేదిక మీకు అనుకూలంగా రావొచ్చని ఆశించారా?
ముందే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు?
కాలిన కరెన్సీ నోట్ల ఉదంతంలో జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
న్యూఢిల్లీ: సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టలు అధికారిక నివాసప్రాంగణంలో బయటపడిన ఉదంతంలో అభిశంసనను ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయం కోసం ఇప్పుడు కోర్టు గడప తొక్కిన మీరు అప్పుడెందుకు కోర్టును ఆశ్రయించలేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి ప్రశ్నవేసింది.
కరెన్సీ నోట్లు బయల్పడిన ఉదంతానికి సంబంధించి హైకోర్టు న్యాయ మూర్తులతో కూడిన దర్యాప్తు కమిటీ ఇచ్చిన తుది నివేదికను చెల్లనిదిగా ప్రకటించాలంటూ యశ్వంత్ వర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ వర్మకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ మీరు తప్పు చేయలేదని భావిస్తే ఆ దర్యాప్తు కమిటీని ముందుగానే సవాల్‌చేయాల్సింది. మీరు అసలు ఆ కమిటీ ఎదుట విచారణకు ఎందుకు హాజరయ్యారు?. సగం కాలిన కరెన్సీలను చూపిస్తున్న వీడియోను తొలగించాలని కోరేందుకే కోర్టుకొచ్చారా?.
దర్యాప్తు కమిటీ విచారణ మొత్తం పూర్తయ్యేదాకా మీరెందుకు వేచి చూశారు?. ఒకవేళ కమిటీ నివేదిక మీకు అనుకూలంగా రావొచ్చని ముందుగానే భావించారా?’’ అని జస్టిస్ వర్మను ధర్మాసనం పలు ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా జస్టిస్ వర్మ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఆరోజు దొరికిన కట్టలకొద్దీ నగదు ఎవరిదో తెల్సుకునేందుకే వర్మ ఆ కమిటీ ఎదుట విచారణకు హాజర య్యారు. విచారణకు హాజరైనంత మాత్రాన తప్పు ఒప్పుకుని విచారణకు వచ్చారని ముందస్తు అంచనాకు కోర్టు రాకూడదు’’ అని సిబల్ వాదించారు.
పిటిషన్ ఇలాగేనా వేసేది?
ఈ విచారణ జరుగుతున్నంతసేపు ధర్మాసనం ఎక్కడా వర్మ పేరు ప్రత్యకంగా ప్రస్తావించకుండా ఎక్స్‌ఎక్స్‌ఎక్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగానే పేర్కొంది. ఇలా పిటిషన్ వేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ పిటిషన్ ఇలాగేనా వేసేది?. ఒకరకంగా సుప్రీంకోర్టు మీదనే కేసు వేసినట్లుగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఆ దర్యాప్తు కమిటీ ఏర్పడిందికదా?’’ అని ధర్మాసనం సిబల్‌కు గుర్తుచేసింది. దీనిపై సిబల్ వివరణ ఇచ్చారు. 124వ అధికరణంలోని ‘‘ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీంకోర్టు’ ప్రకారం జడ్జి పేరును బహిరంగ కేసు విచారణలో ప్రస్తావించకూడదు కదా.
అయినా ఆ నివేదికను అభిశంసనకు ప్రాతిపదికగా తీసుకోకూడదు’’ అని సిబల్ వాదించారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ ఈ కేసులో ఏదైనా నోటీసులు జారీచేయాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరికి పంపాలి?. ఈ జడ్జిని నియమించిన రాష్ట్రపతికా? లేదంటే ఈ మేరకు సలహాలు ఇచ్చిన ప్రధాని సారథ్యంలోని మంత్రిమండలికా? అందుకే ఒకే ఒక్క పేజీలో బుల్లెట్ పాయింట్లతో కేసులో అవతలి పార్టీ ఎవరో స్పష్టంగా పేర్కొని తీసుకుని రండి’’ అని సిబల్‌ను కోర్టు ఆదేశించింది. కేసు రేపటికి వాయిదావేసింది.