నోయిడా జంట టవర్ల కూల్చివేత: వంచితుల వ్యథ తీరేదెప్పుడు! | Supertech Twin Tower Demolition is a Battle of 9 Years That Will End in 9 Seconds | Sakshi
Sakshi News home page

Twin Tower Demolition: వంచితుల వ్యథ తీరేదెప్పుడు!

Published Tue, Aug 30 2022 6:33 AM | Last Updated on Tue, Aug 30 2022 8:06 AM

Supertech Twin Tower Demolition is a Battle of 9 Years That Will End in 9 Seconds - Sakshi

-ఎస్‌.రాజమహేంద్రారెడ్డి  
రెండు ఆకాశ హర్మ్యాలు.. ఒకటి 32 అంతస్తులు, మరొకటి 29 అంతస్తులు. 12 సెకండ్లలో నేలమట్టమయ్యాయి. నోయిడా జంట టవర్ల నిర్మాణానికి అయిన ఖర్చు రూ.70 కోట్లు. కూల్చడానికి అయిన ఖర్చు రూ.20 కోట్లు. వెరసి అక్షరాలా మొత్తం రూ.90 కోట్లు 12 సెకండ్లలో మట్టిలో కలిసిపోయాయి.

అక్రమ కట్టడం కుప్పకూలింది. అక్రమార్కులకు ఇదో పెద్ద హెచ్చరిక అని అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఈ అక్రమ కట్టడం ఆకాశం ఎత్తు లేచే వరకు సాయం చేసిన అధికారులను ఏం చేశారు? వాళ్లనెలాగూ కూల్చలేం. కనీసం వాళ్ల ఉద్యోగాలనైనా కూల్చారా? కోర్టులు ఈ విషయంలో చొరవ తీసుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నాయి.  టవర్లు కోర్టు ఆదేశానుసారం కూలిపోయాయి. శిథిలాలు పోగయ్యాయి. ఎంత ఇంకో మూడు నెలల్లో శిథిలాలను తొలగిస్తాం అని నోయిడా మున్సిపల్‌ అధికారులు మాటిచ్చేశారు.

తాము ఖర్చు పెట్టిన రూ.20 కోట్లలో(కూల్చడానికి) టవర్ల నిర్మాణానికి వాడిన స్టీల్‌ను అమ్ముకుంటే రూ.15 కోట్లయినా వస్తాయని వారి అంచనా. మరి ఈ జంట టవర్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎటుపోవాలి? వారు అప్పో సప్పో చేసి ఫ్లాట్లు కొనుక్కొని ఉంటారు. ఇంకా నెలసరి వాయిదాలు(ఈఎంఐలు) చెల్లిస్తూనే ఉంటారు. వీరి గోస ఎప్పుడు తీరేనూ? ఢిల్లీలో సొంతింటి కల నెరవేర్చుకోలేక శివార్లలో ఉన్న నోయిడాలో కాస్త తక్కువ ధరకు ఈ కోరిక తీర్చుకొని ఉంటారు.

ఈ రెండు టవర్లను(అపెక్స్, సెయాన్‌) నిర్మించిన సూపర్‌టెక్‌ కంపెనీ ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.180 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ డబ్బంతా నిరాశ్రయులైన ఫ్లాట్‌ యజమానులకు తిరిగి చెల్లించాలి. సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ పార్దీవాలాల ధర్మాసనం ఈ నెల 26న ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తూ ‘కొనుగోలుదారులందరికీ వారు చెల్లించిన డబ్బు మొత్తం 12% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి’’ అని సూపర్‌టెక్‌ సంస్థకు స్పష్టం చేసింది. ముందస్తు చర్యగా సూపర్‌టెక్‌ రూ.1 కోటి మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో సెప్టెంబర్‌ 30లోగా జమ చేయాల్సి ఉంటుంది.  

మొత్తం బకాయిలు అందేది ఎప్పుడో?  
కోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ గౌరవ్‌ అగర్వాల్‌ అక్టోబర్‌ మొదటివారంలో సూపర్‌టెక్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశమై కొనుగోలుదారులకు రావాల్సిన బకాయిలను లెక్కతేల్చి సమర్పిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సూపర్‌టెక్‌ కంపెనీ నెలవారీ ఆదాయం రూ.20 కోట్లని, అందులో రూ.15 కోట్లను ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని అమికస్‌ క్యూరీ వివరించారు. మిగతా రూ.5 కోట్ల సొమ్మును ఫ్లాట్ల కొనుగోలుదారులకు బకాయిలు చెల్లించేందుకు వినియోగిస్తామన్నారు.

59 మంది కొనుగోలుదారులకు  చెల్లించాల్సి ఉందని మిగతా వాళ్లలో చాలామందికి డబ్బు తిరిగి చెల్లించడం గానీ, వేరే టవర్లలో ఫ్లాట్‌ కేటాయించడం గానీ జరిగిందని సూపర్‌టెక్‌ యజమాన్యం వెల్లడించింది. కొనుగోలుదార్లలో చాలామందికి ఎంతోకొంత ఇంకా రావాల్సి ఉందని తెలిసింది. టవర్లయితే 12 సెకండ్లలో నేటమట్టమయ్యాయి. కానీ, చివరి కొనుగోలుదారుడికి బకాయిలు అందేసరికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే! సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి కొనుగోలుదారులందరికీ వారి కష్టార్జితం వడ్డీతో సహా అందుతుందనే ఆశిద్దాం.

వడ్డీ కడుతూనే ఉన్నాం..  
సెయాన్‌లో ఫ్లాట్‌ కొనేందుకు 2011లో రూ.26 లక్షలు అప్పు తీసుకున్నాం. అన్ని అనుమతులు వచ్చాక నిర్మాణం చేపట్టారని నమ్మాం. అందుకే అప్పు తెచ్చి మరీ కొన్నాం. అక్రమ నిర్మాణమని కోర్టులు తేల్చడంతో గుండెలో రాయి పడ్డట్టు అయ్యింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు. తెచ్చిన అప్పునకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాం. పెట్టిన డబ్బంతా మా చేతికి వస్తేగానీ కుటుంబం కుదుటపడదు.   – కె.వర్మ (ఉద్యోగి)  

కనువిప్పు కావాలి
2009లో రూ.50 లక్షలు అప్పు తెచ్చి అపెక్స్‌ టవర్‌లో ఫ్లాట్‌ బుక్‌ చేశా. కోరుకున్న చోట ఇల్లు కొంటున్నామన్న సంతోషం కోర్టు ఆదేశంతో నీరుగారిపోయింది. అక్రమ కట్టడమని తేల్చడానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. అనుమతులన్నీ ఉన్నాయని నిర్మాణ సంస్థ బుకాయించడం కూడా జీర్ణం కాలేదు. విధిలేక ఈ ఫ్లాట్‌కు బదులుగా సూపర్‌టెక్‌ సంస్థ ఇవ్వజూపిన వేరే ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. కూల్చివేతతో వివాదం ముగిసినప్పటికీ డబ్బు చెల్లించాక  మాకు ఇష్టమైన ఫ్లాట్‌ను పొందలేకపోయామన్న బాధ మిగిలే ఉంది. అక్రమ నిర్మాణాలకు తెగబడే బిల్డర్లకు, వారితో లాలూచీ పడి కళ్లు మూసుకొని అన్ని అనుమతులు మంజూరు చేసే అధికారులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి.  – గుప్తా (వ్యాపారి)  

ఆరంభం నుంచి నేలమట్టం దాకా..  
► 2004: నోయిడా ‘సెక్టార్‌ 93ఎ’లో గృహ సముదాయం కోసం సూపర్‌టెక్‌ సంస్థకు స్థలం కేటాయింపు (ఎమెరాల్డ్‌ కోర్టు హౌజింగ్‌ సొసైటీలో)  
► 2005: ఎమెరాల్డ్‌ కోర్టు హౌజింగ్‌ సొసైటీ భవన నిర్మాణ ప్లాన్‌కు నోయిడా అథారిటీ అనుమతి మంజూరు. 10 అంతస్తుల చొప్పున 14 రెసిడెన్షియల్‌ టవర్ల నిర్మాణానికి అనుమతి  
► 2006: మరింత స్థలం కావాలన్న సూపర్‌టెక్‌ సంస్థ వినతికి నోయిడా అథారిటీ అంగీకారం. తొలుత అనుమతి ఇచ్చిన భవన నిర్మాణ ప్లాన్‌కు సవరణలు. 14 టవర్లకు బదులుగా మరో టవర్‌ నిర్మాణానికి ఓకే. దీంతో మొత్తం 15 టవర్లకు అనుమతి ఇచ్చింది.  
► 2009: నిర్మాణ సంస్థ మరోసారి ప్లాన్‌ను మార్చి మరో రెండు టవర్ల(అపెక్స్, సెయాన్‌)ను అదనంగా చేర్చింది. అయితే, ఈ రెండు టవర్లలో 24 అంతస్తులు ఉండేటట్టుగా ప్లాన్‌ మార్చడంతోపాటు వెంటనే నిర్మాణం కూడా చేపట్టింది. దీనికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  
► 2012: నిర్మాణ సంస్థ మరోసారి తన ప్లాన్‌ను సవరించి అపెక్స్, సెయాన్‌ టవర్లను 40 అంతస్తులకు పెంచింది. నిర్మాణ పనులను వేగవంతం చేసింది.  
► 2012 డిసెంబర్‌: ఎమెరాల్డ్‌ కోర్టు సొసైటీలోని కొందరు ఈ విషయాన్ని అలహాబాద్‌ హైకోర్టుకు విన్నవిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.  
► 2014: జంట టవర్లను కూల్చివేయాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని నోయిడా అథారిటీని తప్పుపట్టింది. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి.  
► 2014 మే: అనుమతులన్నీ ఉన్నాయంటూ సూపర్‌టెక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  
► 2021 ఆగస్టు 31: దాదాపు ఏడేళ్ల వాదోపవాదాల తర్వాత జంట టవర్లను కూల్చివేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా పని పూర్తికావాలని ఆదేశించింది.   
► 2022 ఫిబ్రవరి: మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది.  
► 2022 మే 17: కూల్చివేత కాల పరిమితిని సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది.  
► 2022 ఆగస్టు 28: జంట టవర్లు నేలమట్టం. సూపర్‌టెక్‌ సంస్థ నిర్మించిన 15 టవర్ల ఎమెరాల్డ్‌ కోర్టు హౌజింగ్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 650 ఫ్లాట్లు ఉన్నాయి. నేలమట్టమైన అపెక్స్, సెయాన్‌ టవర్లు ఇప్పటికీ నిలిచి ఉంటే మరో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు అదనంగా       ఉండేవి.


రూ. 31.5 లక్షలు రావాలి  
‘‘నేను 2010లో సెయాన్‌లో రూ.42 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఈ కట్టడం అక్రమమని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడే మా కుటుంబం యావత్తూ కుంగిపోయాం. బిల్డర్స్‌తోపాటు నోయిడా అథారిటీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఎలా మంజూరు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదో పెద్ద అవినీతి సౌధం. 12 శాతం వడ్డీతో కలిపి నాకు రూ.80 లక్షలు బకాయిపడ్డారు. ఇందులో భాగంగా వేరేచోట ఇంకో ఫ్లాట్‌ ఇచ్చారు. అదిపోనూ ఇంకా రూ.31.5 లక్షలు రావాల్సి ఉంది’’  
– పునీత్‌ (వ్యాపారి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement