రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: సుఖేందు | Sukhendu Sekhar Roy resigns from Rajya Sabha, and Trinamool Congress | Sakshi
Sakshi News home page

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: సుఖేందు

Jun 9 2026 5:06 AM | Updated on Jun 9 2026 5:06 AM

Sukhendu Sekhar Roy resigns from Rajya Sabha, and Trinamool Congress

టీఎంసీ పార్టీకి సీనియర్‌ నేత సుఖేందు శేఖర్‌ రే పెద్ద షాక్‌ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. మమత హయాంలో అవినీతి చోటుచేసుకుందని, అన్ని వర్గాలకూ పార్టీ దూరమైందని ఆయన ఆరోపించారు. 

ఆర్‌జీ కర్‌ బోధనాస్పత్రిలో వైద్యురాలి హత్యోదంతంలో టీఎంసీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని శేఖర్‌ రే ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తే పార్టీలో తనను ఒంటరిని చేశారని విమర్శించారు. అప్పట్లో నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని శేఖర్‌ రే చెప్పారు.

 రాజ్యసభ ఛైర్మన్‌ సి.పి.రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పించానని తెలిపారు. ఇకపై రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉండగా, ఆయన రాజీనామాతో ఈ సంఖ్య 12కి పడిపోయింది. రాజ్యాంగ నిపుణుడైన సుఖేందు శేఖర్‌ రే చాలా ఏళ్లుగా పార్లమెంట్‌లో టీఎంసీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుగాంచారు. శాసన, రాజ్యాంగపరమైన అంశాలపై గొంతు వినిపించారు. 

ఆయన రాజీనామాపై టీఎంసీ నాయకత్వం ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా, పలువురు అసమ్మతి ఎంపీలు సుఖేందు శేఖర్‌ రేతో సమావేశం కావడం గమనార్హం. అనంతరం వీరంతా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా మమతా బెనర్జీ, అభిõÙక్‌ బెనర్జీ ఢిల్లీలో అసమ్మతి ఎంపీలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొందరు ఎంపీలు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సోమవారం బీజేపీ నేతలను కలిసి ఎంపీల్లో సుఖేందు సైతం ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement