
క్వెట్టా: పాకిస్తాన్(Pakistan)లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఒక స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారు. ఈ వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో ఒక బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్స్(Ambulance)లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించలేదు. అయితే పోలీసులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ఈ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో ఎక్కువ శాతాన్ని బీఎల్‌ఏనే చేసింది. గత మార్చిలో బలూచిస్తాన్‌లో రైలుపై జరిగిన దాడిలో బీఎల్‌ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు.
తాజాగా జరిగిన దాడిని పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. చిన్నారుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారిని మృగాలుగా అభివర్ణించారు. వారు ఎటువంటి దయకు అర్హులు కారని అన్నారు. ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. కాగా బలూచిస్తాన్‌లో చాలా కాలంగా వేర్పాటువాద హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు, భద్రతా దళాలు ఈ దాడులకు బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?