
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్(Banu Mushtaq) రచించిన చిన్న కథల సంకలనం ‘హార్ట్ లాంప్’ 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌కు ఎంపికయ్యింది. దీపా భస్తి కన్నడ నుండి ఆంగ్లంలోకి ఈ పుస్తకాన్ని అనువదించారు. ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి కన్నడ పుస్తకంగా ‘హార్ట్ లాంప్’ గుర్తింపు పొందింది.
‘హార్ట్ లాంప్’లో ముష్తాక్ రాసిన 12 చిన్న కథలు ఉన్నాయి. ఈ పుస్తకం 2024లో ఇంగ్లీష్ పెన్ అనువాద అవార్డును కూడా గెలుచుకుంది. ఈ పుస్తకం షార్టలిస్ట్‌కు ఎంపికైనప్పుడు ముష్తాక్ మాట్లాడుతూ ‘ఇది ఒక పెద్ద విజయం. నేను దీనిని పాఠకులకు, కన్నడ ప్రేమికులకు మంచి హృదయాలు కలిగిన భారతీయులకు అంకితం చేస్తున్నాను. నా కథలు సామాజిక సంక్షోభాలు, భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రతిస్పందనల నుండి ఉద్భవించాయి. వీటిలో కొన్ని కథలు రాయడానికి ఒక వారం పట్టింది, కొన్నింటికి పది రోజులు పట్టింది. ప్రేరణ అవసరం లేదు. బాధ, నిస్సహాయత, కోపం మాత్రమే సరిపోతుంది. నేను ఏడుస్తున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కథలు రాశాను’ అని భాను ముషాక్ పేర్కొన్నారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాను ముష్తాక్‌ను అభినందించారు.
స్పష్టమైన కథనం, కథను నడిపించే తీరు ‘హార్ట్ ల్యాంప్’(‘Heart Lamp’)ను అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. కాగా బుకర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతలు అనువాదకుల ప్రతిభను కూడా గుర్తిస్తారు. ఈ బహుమతి మొత్తం £50,000 (సుమారు రూ. 52,00,000)ను సమానంగా విభజిస్తారు. రచయితకు £25,000 (సుమారు రూ. 26,00,000) అనువాదకునికి £25,000 (సుమారు రూ.26,00,000) అందిస్తారు. న్యాయనిర్ణేతలు ప్రచురణకర్తలు సమర్పించిన 154 పుస్తకాల నుంచి ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేస్తారు. ‘హార్ట్ లాంప్’ పుస్తకం దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజంలోని మహిళలు, బాలికల దైనందిన జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1990- 2023 మధ్య కాలంలో రాసిన ఈ పుస్తకంలో భావోద్వేగాలు, లోతైన సామాజిక ఉద్రిక్తతలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: ‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’