పార్టీలన్నింటికీ... నవంబర్‌ పరీక్ష...! 

States Have Elections In November - Sakshi

ఐదు రాష్ట్రాలు. వాటిలో నాలుగు కీలక రాష్ట్రాలు. మొత్తం 16 కోట్ల పై చిలుకు ఓటర్లు. దాదాపు 650 పై చిలుకు అసెంబ్లీ స్థానాలు. ఎంతోమంది వెటరన్‌ నాయకులకు కీలక పరీక్ష. కీలకమైన లోక్‌సభ ఎన్నికల ముంగిట మోదీ సారథ్యంలోని బీజేపీకి, దాని ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో పుట్టుకొచ్చిన విపక్ష ఇండియా కూటమి సత్తాకూ అగ్నిపరీక్ష! 

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఇలా ఎన్నో రకాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటి ఫలితాలపైనా సర్వత్రా అంతే ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే నవంబర్‌ కీలకంగా మారనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేయనున్నాయి. అందుకే వీటి ఫలితాలను తమకు అనువుగా మార్చుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని ఏమీ లేదు. ఉదాహరణకు 2018లో ఇలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మూడింట్లోనూ   కాంగ్రెస్సే నెగ్గింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ నెగ్గింది కేవలం మూడంటే మూడు! ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కచ్చితంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు మూడ్‌ సెట్‌ చేస్తాయని భావిస్తున్నారు.

ఎవరి ప్రయత్నాల్లో వారు...

కాంగ్రెస్:
కర్ణాటకలో మాదిరిగా రాష్ట్రాలవారీగా సామాజిక, ఆర్థిక, సంక్షేమ పథకాల ప్రకటన...
ఓబీసీలను బీజేపీకి దూరం చేసేందుకు జాతీయ స్థాయిలో కులగణనకు డిమాండ్‌
స్థానికాంశాలకు ప్రాధాన్యం. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికల్లో వీలైనంత వరకు స్థానిక ముఖ్య నేతలకు నిర్ణయాధికారం.

బీజేపీ:
నరేంద్ర మోదీ ఛరిష్మాను ఓట్లుగా మార్చుకునేలా ప్రచారం...
కేంద్ర మంత్రులతో పాటు పేరున్న సీనియర్‌ ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు
జీ20 సదస్సు ఘనవిజయం, మహిళా బిల్లు, ఎల్పీజీ సిలిండర్‌ ధర తగ్గింపు వంటి ప్రచారాలు

ఈ సీనియర్లకు పెను పరీక్ష
తాజా అసెంబ్లీ ఎన్నికలు ఎంతోమంది వెటరన్‌ నాయకుల భవితవ్యాన్ని తేల్చేయనున్నాయి. బీజేపీ నుంచి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రాజస్తాన్‌లో వసుంధర రాజె, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌తో పాటు కాంగ్రెస్‌ నుంచి రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌  తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే తెలంగాణలో భారాస అధినేత కేసీఆర్, మిజోరంలో సీఎం జోరాంతంగా ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పుట్టుకొచ్చిన ఇండియా కూటమికి ఈ ఎన్నికలు తొలి అగ్నిపరీక్ష కానున్నాయి.  

2018లో 5 రాష్ట్రాల్లో పార్టీలవారీ ప్రదర్శన
పార్టీ     స్థానాలు     ఓట్ల శాతం
కాంగ్రెస్‌    306     45
బీజేపీ    199     29
ఇతరులు    174     26 

అంకెల్లో ఎన్నికలు...
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, 
మిజోరంల్లో మొత్తం 

లోక్‌సభ స్థానాలు 83

మొత్తం అసెంబ్లీ స్థానాలు 679

మొత్తం ఓటర్లు 16.1 కోట్లు

మహిళా ఓటర్లు 7.8 కోట్లు

తొలిసారి ఓటర్లు 62 లక్షలు

ఇదీ చదవండి: చీలిక దిశగా జేడీ(ఎస్‌)?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top