
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం.
సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే..
జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.
దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.
అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు.