
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్ రాజీనామా అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం ఉంది. ఈ ఎన్నికలు 1952 నాటి ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్, 1974 నాటి ఎన్నికల నియమావళి ప్రకారం నిర్వహించనున్నారు.
జగ్‌దీప్ ధన్‌కడ్ రాజీనామా నేపథ్యంలో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. కాగా ఈ ప్రక్రియకు సంబంధించిన ఇప్పటికే పలు కీలక కార్యాచరణలు ప్రారంభమైనట్లు కమిషన్ వెల్లడించింది. లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌లను కూడా ఖరారు చేశారని సమాచారం. త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పీ. పవన్ తెలిపారు.