
బెబ్బులుల సంరక్షణ కోసం 58 రక్షిత ప్రాంతాలు
సింహాల అవసరాలకు కారిడార్ అభివృద్ధి
వన్యప్రాణుల బారినపడి మరణించిన వారికి రూ.10లక్షల నష్టపరిహారం
కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే దేశంలో ప్రస్తుతం పులులు, సింహాలు, ఏనుగుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,682 పులులు, 891 సింహాలు, 30,711 ఏనుగులు ఉన్నట్లు రాజ్యసభలో కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. వీటి సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ రాష్ట్రాలతో కలిసి నాలుగేళ్లకోసారి అఖిల భారత పులుల అంచనా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీని ఆధారంగా..2018లో 2,967 పులుల జనాభా ఉండగా, 2022లో 3,682కు పెరిగిందన్నారు.
గుజరాత్ రాష్ట్రం నిర్వహించిన 16వ సింహాల సంఖ్య అంచనా ప్రకారం
2020లో 674 సింహాలు ఉన్నట్లు అంచనా వేయగా..
2025లో 891 సింహాలు ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు.
ఇక ఏనుగుల సంఖ్య అంచనా
2017లో పూర్తి అయినట్లు చెప్పారు.
2017లో ఏనుగులు 29,964 ఉన్నట్లు తెలిపారు.
పులుల సంరక్షణకు 58 నిల్వల ఏర్పాటు..
వన్యప్రాణులను, వాటి ఆవాసాలను సంరక్షించేందుకు 1972 వన్యప్రాణుల(రక్షణ) చట్టంలోని నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా వన్యప్రాణుల ఆవాసాలను కవర్ చేసే ఉద్యానవనాలు, అభయారణ్యాల వంటి రక్షిత ప్రాంతాల నెట్‌వర్క్ సృష్టించినట్లు కీర్తివర్ధన్ చెప్పారు. దేశంలో దాదాపు 2.5శాతం భౌగోళిక ప్రాంతంలో పులులు నివాసం ఉంటున్నట్లు కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు. వీటి సంరక్షణ కోసం 58 పులుల నిల్వలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక సింహాల విషయంలో గుజరాత్‌లోని బర్దాలో రెండవ నివాసాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆసియా సింహాల ఆవాస అవసరాలను తీర్చేందుకు గుజరాత్ రాష్ట్రంలో ఆవాస మెరుగుదల పనులు, కారిడార్ అభివృద్ధి, రక్షిత ప్రాంతాల వెలుపల గడ్డి భూముల మెరుగుదల పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏనుగుల సంరక్షణ కోసం 14 ఏనుగుల శ్రేణి రాష్ట్రాలలో 33 ఏనుగుల నిల్వలు స్థాపించినట్లు వివరించారు.
వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, మరణించిన బాధితులకు ‘వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి’, ‘ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్’ కింద నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. శాశ్వత వైకల్యం లేదా మరణించిన వారికి రూ.10లక్షల నష్టపరిహారాన్ని 24గంటల్లో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
కెమెరాల ద్వారా లెక్కింపు..
టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమైన రోజుల్లో పులుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించిన పద్ధతులు అశాస్త్రీయమైనవిగా తేలాయి. ఒక పులిని పలుమార్లు లెక్కించడం వల్ల పులుల సంఖ్యలో తప్పులు వచ్చాయి. ఆ తర్వాత పులుల పాదముద్రల ఆధారంగా లెక్కించేవారు. వాటితోనూ పులుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదని అధికారులు గ్రహించారు. అనంతరం పులులను లెక్కించే అత్యాధునిక పద్ధతి ‘కెమెరా డ్రాప్’ అందుబాటులోకి వచ్చింది.
పులుల సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిలో రికార్డు అయిన పులుల ఫొటోల ఆధారంగా వాటి సంఖ్యను లెక్కిస్తున్నారు. ఆ ఫొటోల్లో కనిపిస్తున్న పులుల చర్మంపై ఉన్న చారలను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. మనిషి వేలిముద్రల లాగే పులి చర్మంపై ఉండే చారలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఏ రెండు పులులకు ఒకే విధంగా చారలు ఉండవు. ఇది ఒక పులిని రెండోసారి లెక్కించకుండా ఉపయోగపడుతుంది. ఈ అత్యాధునిక ‘కెమెరా డ్రాప్’ ద్వారా పులులను లెక్కిస్తున్నారు.