పల్లెల్లో పులి పంజా | Wild animals enter villages for water and food | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పులి పంజా

Oct 9 2025 5:52 AM | Updated on Oct 9 2025 5:52 AM

Wild animals enter villages for water and food

కొండకింద, అటవీ సమీప గ్రామాల్లో పెద్దపులులు, చిరుతల అలజడి  

నీరు, ఆహారం కోసం గ్రామాల్లోకి వన్య ప్రాణులు  

పులులను ప్రత్యక్షంగా చూడటంతో వణుకుతున్న రైతులు  

పొలాలకు సైతం వెళ్లేందుకు వెనకాడుతున్న అన్నదాతలు  

వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని గ్రామాల్లో ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు  

కనిగిరి ఫారెస్ట్‌ పరిధిలో 15 నుంచి 20 వరకు చిరుతలు  

దట్టమైన అడవుల్లో సంచరించే పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం, నీటి కోసం అటవీ సమీప గ్రామాల్లో, కొండ కింద శివారు గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం అధికమైంది. నల్లమల అటవీ ప్రాంతంతో పాటు, వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్టు సమీప గ్రామాల్లో చిరుతలు, పెద్దపులులు తరచూ స్థానికుల కంటపడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లేందుకు రైతులు, పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లేందుకు పశుపోషకులు జంకుతున్నారు.

కనిగిరిరూరల్‌/పెద్దదోర్నాల:  నల్లమలలో కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల జరిగిన పులుల గణనలో పులుల సంతతి పెరిగిన విషయం తేలింది. ప్రసుతం నల్లమల అభయారణ్యంలో 85 వరకు పెద్దపులులు, లెక్కకు మించిన చిరుత పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  వర్షాకాలం ఆరంభమైన నాటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో నల్లమలలో కొంత మేర నీటికి ఇబ్బందులతో పాటు పులుల ఆహార సమస్యలను తీర్చే సాంబార్, కణుతుల వంటి భారీ వన్యప్రాణుల సంచారం లేకపోవటంతో పులులకు ఆహార కొరత ఏర్పడింది. 

నీరు, ఆహారాన్ని వెతుక్కుంటూ పులులు అటవీ సమీప గ్రామాలకు వస్తుండటంతో స్థానికుల కంటపడుతున్నాయి. కొన్నిసార్లు పశువులపై దాడి చేస్తున్నాయి.   ప్రకాశం జిల్లా కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో సుమారు 48,500 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 7 సెక్షన్‌లు, 16 బీట్‌లు ఉన్నాయి. ప్రధానంగా భైరవకోన, వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్‌ల పరిధిలోని కొండ కింద శివారు గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తోంది. వారం రోజుల క్రితం మరపగుంట్లలో పులి సంచరిస్తున్నట్లు ప్రచా­రం జరిగింది. ఫారెస్ట్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు సేకరించి 3, 4 ఇంచుల పొడవు ఉన్నట్లు తెలిపారు. పాద ముద్రలను బట్టి అది పెద్దపులి కాదని నిర్ధారించారు. పెద్దపులి పాద ముద్రలు 7, 8 ఇంచుల పొడవు ఉంటాయన్నారు. 

అక్కడ ఉన్న పాదముద్రల నమూనాలను బట్టి చిరుత పులి, లేదా జంగు పిల్లి అయి ఉంటుందని ఫారెస్ట్‌ అధికారులు వెల్లడించారు. తాజా­గా గత శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి మధ్య ప్రాంత పొలాల్లో, గ్రామ శివార్లలో బైక్‌పై వెళ్తున్న ఒకరు పులిని చూసినట్లు చెప్పాడు. దీంతో ఆదివారం ఫారెస్ట్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పాదముద్రల నమూనాలను సేకరించారు. ఆ ప్రాంతంలో ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తుంగోడు, చెన్నపునాయిని­పల్లి, మైలుచర్ల బొంతవారిపల్లి, పిల్లిపల్లి బీట్‌లలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో వన్య ప్రాణులతో పాటు చిరుత పులులు కనిపించినట్లు ఫారెస్ట్‌ అధికారులు వెల్లడించారు.   

యర్రగొండపాలెం రేంజ్‌ పరిధిలోనూ.. 
యర్రగొండపాలెం రేంజి పరిధిలోని కొలుకుల బీట్‌లో పెద్దపులి కనబడటంతో రైతులు భయంలో వణికిపోతున్నారు. గత ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తున్న  రైతులకు పెద్దపులి కనిపించింది. దీంతో పొలాలకు వెళ్తున్న రైతులతో పాటు రైతు కూలీలు సైతం భయాందోళనతో వణికిపోతున్నారు. కొలుకుల బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దదోర్నాల మండల పరిదిలోని పెద్ద»ొమ్మలాపురం రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటంతో తరచూ వన్యప్రాణులతో సమస్యలు ఎదురవుతున్నాయి. 

పెద్దపులి సంచారం ఉన్న దేవలూడు ప్రాంతంలో గతంలోనే అటవీశాఖ బేస్‌ క్యాంపును ఏర్పాటు చేసింది. పులులకు ఆహారం దొరక్క పశువుల మందలు ఉన్న పెద్దదోర్నాల మండలం గండిచెరువు సమీప ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉందని పశువుల కాపరులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దేవలూడు ప్రాంతంలో నీటి నిల్వలు అధికంగా ఉండటం కూడా పులు­­ల సంచారానికి మరో కారణమని పలువురు పేర్కొంటున్నారు. 

గతంలో పాలుట్లలో తన పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న రైతు బాలునాయక్‌పై పెద్దపులి దాడి చేసి గాయపర్చగా, బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు ఎద్దును సైతం పులి హతమార్చింది. గ్రామానికి చెందిన దేవలూడు, గండి చెరువు ప్రాంతాల్లోనే ఎక్కువ  వ్యవసాయ భూములు ఉండటంతో బొమ్మలాపురం వాసులు ఆందోళ­న చెందుతున్నారు.     

గిద్దలూరు నియోజకవర్గంలోనూ.. 
అర్థవీడు మండలంలోని కొ­త్తూరు, దొనకొండ, వెలగలపాయ, బొల్లుపల్లి, అచ్చంపేట, మాగుటూరు, మోహిద్దీన్‌పురం గ్రామాల పరిధి­లో తరచూ పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెలగలపాయ, దొనకొండ, మాగుటూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. మొహిద్దీన్‌పురం వద్ద కారులో వెళ్తున్న కొందరికి పులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. 

కంభం మండలంలోని దర్గా కొండ సమీపంలో నెల రోజుల క్రితం పులి అడుగులు కనిపించడంతో ఫారెస్టు అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని సూరేపల్లి సమీపంలో కొండవద్ద పులి అడుగులు ఉన్నాయని స్థానికులు చెప్పగా ఫారెస్టు అధికారులు ట్రాప్‌ కెమెరాలు బిగించి పరిశీలించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో నీటివనరులు ఏర్పాటు చేయాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పులి సంచారంపై వివరాలు సేకరించాం 
పులి సంచారానికి సంబంధించిన వివరాలను సేకరించాం. ఆ ప్రాంతంలో పులి కాలి గుర్తులు లభించాయి. దేవ­లూడు అటవీ ప్రాంతం కాబట్టి పులుల సంచారం ఉంది. పెద్ద­బొమ్మలాపురంలో పులి సంచారంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.  – హరి, ఫారెస్టు రేంజి అధికారి, పెద్దదోర్నాల  

ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం 
కనిగిరి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో పెద్ద పులులు లేవు. భైరవకోన, వెలిగొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు ఉన్నాయి. వారం రోజుల నుంచి నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్‌ పరిధిలోని గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తున్నాం. 

మన ప్రాంతంలో పెద్ద పులులు లేవు. అయినా కొండ కింద గ్రామాల ప్రజలు ఆరుబయట రాత్రి వేళ నిద్రించవద్దు. పొలాలకు వెళ్లే రైతులు, మేతకు అడవుల్లోకి వెళ్లే వారు ఒంటరిగా పోవద్దు. గ్రామ మొదట్లోనే పశువులను మేపుకోండి. నీటి కోసం, ఆహారం కోసం రాత్రిపూట వన్య ప్రాణులు అడవి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.   – తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, కనిగిరి    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement