త్రినేత్రం
చిన్నప్పుడు ‘అనగనగా ఒక అడవి ఉంది’ లాంటి కథలు మాత్రమే కాదు... అడవులు పర్యావరణానికి ఎంత ప్రాణప్రదమో చెప్పే కథలెన్నో విన్నది రీటా. కట్ చేస్తే... రీటా బెనర్జీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్. ‘అదిగో...అడవి మాట్లాడుతోంది వినండి’ అంటాయి ఆమె చిత్రాలు. గ్రీన్ ఆస్కార్ (పాండా అవార్డ్)లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌లు అందుకుంది.
రీటా బెనర్జీకి అడవి చిరకాల నేస్తం. వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్‌గా మూడు దశాబ్దాల ప్రయాణంలో అడవితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. అడవి లోతుపాతులు తెలిసిన
సూక్ష్మగ్రాహి. ది టర్టిల్ డైరీస్, ది వైల్డ్ మీట్ ట్రయల్, ది అమూర్ ఫాల్కన్ స్టోరీ, ఏ షాల్ టు డైఫర్... మొదలైన చిత్రాలలో అడవి సూక్ష్మరూపం నుంచి విశ్వరూపం వరకు
చూపించింది.
ఎ షాల్ టు డై ఫర్
టిబెటన్ జింకకు ముప్పు పొంచి ఉంది. ఈ జింక ఉన్నిని కోసి షాతుష్ శాలువాలు నేస్తారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. షాతుష్ శాలువాల వ్యాపారం నిషేధించినప్పటికీ చాటుమాటుగా జరుగుతూనే ఉంది. వైల్డ్‌లైఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ కశ్మీర్‌లోయలో నిర్వహించిన సర్వేలో షాతుష్ శాలువాల తయారీలో 14,293 మంది వరకు పాల్గొంటున్నారని తేలింది. జమ్మూ కశ్మీర్ వణ్య్రపాణుల సంరక్షణ చట్టంలోని లొసుగులు ఉపయోగించుకొని అక్రమంగా షాతుష్ శాలువాలు నేస్తున్నారు. ఈ అక్రమాలు ఎందుకు కొనసాగుతున్నాయి అనేదాని గురించి ‘ఎ షాల్ టు డై ఫర్’ చిత్రాన్ని తీసింది రీటా బెనర్జీ.
పర్యావరణం, వన్య్రపాణుల చిత్రాలకు సంబంధించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సీఎంఎస్‌లో ఈ చిత్రం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో టెక్నికల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ గెలుచుకుంది.
శక్తిమంతమై దృశ్యభాష
పంచ్ డైలాగ్‌లకు కాదు ‘పవర్ ఆఫ్ విజువల్ వొకాబులరీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది రీటా. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రొఫెసర్‌లు. ప్రకృతి ప్రేమికులు. చిన్న వయసు నుంచి పర్యావరణ హిత విషయాలను పిల్లలకు చెబుతుండేవారు. ప్రమాదంలో ఉన్న పాములను రక్షించేవాడు తండ్రి. వారి ఇంటి వెలుపల ఉన్న గుల్మొహర్ చెట్టుకు పక్షిగూళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి.
కాలేజీ రోజుల్లో రీటాకు పాత ఆగ్ఫా అనలాగ్ కెమెరాను బహుమతిగా ఇచ్చాడు తండ్రి. ఆ కెమెరా తనకు కొత్తదారిని చూపించింది. ఫిల్మ్‌మేకింగ్‌లోకి రావడానికి ఆ పాత కెమెరా తొలి మెట్టు అయింది. డిగ్రీ పూర్తయిన తరువాత ‘రివర్‌బ్యాంక్ స్టూడియోస్’లో చేరింది. ప్రముఖ పర్యావరణవేత్త మైక్ పాండే నడుపుతున్న స్టూడియో అది.కెమెరా లెన్స్‌లో నుంచి ప్రతిసారీ రీటాకు కొత్త ప్రపంచం కనిపించేది.
గ్రీన్‌హబ్ నెట్‌వర్క్
అస్సాంలోని తేజ్‌పూర్‌లో ‘గ్రీన్‌హబ్ నెట్‌వర్క్’ ప్రారంభించిన రీటా, ఈశాన్య భారతంలోని మారుమూల గ్రామాల యువత పర్యావరణ అంశాలను డాక్యుమెంట్ చేసేలా తీర్చిదిద్దింది. ‘అడవి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి ఫిల్మ్‌మేకింగ్ ఉపకరిస్తుంది. చెట్టు నుంచి పుట్ట వరకు ప్రతిదీ అడవికి తమ వంతుగా సహాయపడుతుంది. అవి అడవితో పాటు వృద్ధి చెందుతాయి. ఈ సమష్టి వృద్ధి అందమైనది. ఎన్నో విషయాలు నేర్చుకోదగినది’ అంటుంది రీటా.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని నైషీ తెగ ప్రజలకు జంతువులతో అనుబంధం ఉన్నప్పటికీ, మాంసం కోసం వాటిని వేటాడుతారు. వాటి ఈకలు, ఎముకలను అమ్ముకుంటారు. ఇలాంటి విషయాలెన్నో ‘ది వైల్డ్ మీట్ ట్రయల్’ చిత్రం ద్వారా చూపించింది రీటా. ఈ చిత్రం పాండా అవార్డ్ గెలుచుకుంది. ‘వేట అనేది పరిశ్రమ స్థాయికి చేరి రాష్ట్రాల సరిహద్దులను దాటింది. వన్య ప్రాణులకు వేట ఎలా ముప్పుగా మారిందో మా చిత్రం ద్వారా చూపాం’ అంటుంది రీటా.
నేషనల్ జాగ్రఫిక్ అశోకా అవార్డ్, సీఎంఎస్ పృథ్వీరత్న అవార్డ్, ఆర్‌బీఎస్ ఎర్త్ హీరోలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు మూడు గ్రీన్ ఆస్కార్ అవార్డ్‌లు అందుకుంది రీటా బెనర్జీ.
వెలగాలి ఆశాదీపాలు
ఏమాత్రం ఇక ఆశ లేదు అని మనం ఆగిపోతే నిజంగానే ఏమీ జరగదు. ఆశాదీపాలు వెలిగితేనే ఆ వెలుగులో సమస్యలకు పరిష్కారాలు చూపే కొత్త దారులు కనిపిస్తాయి. ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకొని పనిచేస్తుంటే ఎక్కడో ఒకచోట తప్పకుండా ఫలితం దక్కుతుంది. అపనమ్మకాలతో కాకుండా ఏదీ చేసినా గట్టి విశ్వాసంతో చేయాలి. సమస్యలలాగే వాటి పరిష్కారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే ఆ పరిష్కారాల వైపు మనం దృష్టి పెడుతున్నామా లేదా అనేది అసలు సమస్య. ఉదాహరణకు... తీ ర్రపాంతాలలో నివసించే ప్రజల మాట మనం నిజంగా వింటున్నామా? వారితో కలిసి పనిచేస్తున్నామా? ఆ అనుభవాల నేపథ్యంలో సరిౖయెన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి.
– రీటా బెనర్జీ


