
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మెంటార్‌గా లెజెండర్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధోనిని భారత క్రికెట్ బోర్డు సంప్రదించినట్లు ఒక నివేదిక పేర్కొంది.
కాగా మిస్టర్ కూల్ టీ20 ప్రపంచకప్-2021లో అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రితో కలిసి భారత జట్టు మెంటార్‌గా ధోని పనిచేశాడు. కానీ ఆ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు ఆశించినంత మేర రాణించలేకపోయింది. లీగ్ స్టేజిలోనే ఇంటుముఖం పట్టింది. ఆ తర్వాత ధోని భారత కోచింగ్ సెటాప్‌లో ఎప్పుడూ భాగం కాలేదు.
అయితే ఇప్పుడు మరోమారు ధోని సేవలను ఉపయోగించుకోవాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నరంట. క్రిక్‌బ్లాగర్ రిపోర్ట్ ప్రకారం.. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని బోర్డు విశ్వసిస్తన్నట్లు సమాచారం. అతడి సేవలను సుదీర్ఘంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరించే అవకాశం లేదని సదరు నివేదిక పేర్కొంది. అందుకు కారణం ధోని, గంభీర్ మధ్య ఉన్న వైర్యమే. ఒకవేళ ధోని ఒప్పుకొన్న గంభీర్ అందుకే ఓకే అంటాడన్నది అనుమానమే. ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు భారత జట్టుకు కలిసి ఆడినప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి.
ధోని కెప్టెన్సీలో గెలిచిన టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్ జట్లలో గంభీర్ సభ్యునిగా ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2011 ఫైనల్లోనూ గౌతీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ క్రెడిట్ అంతా కెప్టెన్‌గా ధోని ఇచ్చారని, అది సరికాదంటూ చాలా సందర్భాల్లో గంభీర్ వ్యాఖ్యానించాడు.
అయితే ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి పోయారని, కచ్చితంగా ధోని రాకను గంభీర్ స్వాగతిస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మరి కొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది.
చదవండి: DPL 2025: దిగ్వేష్-రాణా మధ్య వాగ్వాదం.. కొట్టుకునేంత వరకు వెళ్లారు! వీడియో