గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత్ తమ ప్రయోగాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో చావు దెబ్బ తినడంతో గౌహతి టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్‌ను తయారు చేయాలని క్యూరేటర్‌ను టీమ్ మేనెజ్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
కోల్‌కతాలో ఉపయోగించిన నల్ల మట్టి పిచ్‌లా కాకుండా.. రెడ్ సాయిల్ పిచ్‌లపై పేస్‌తో పాటు బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాక్‌లపై క్రాక్స్ కూడా ఎక్కువగా రావు. అంతేకాకుండా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా పిచ్ అనుకూలించే అవకాశముంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం, బీసీసీఐ ప్రధాన క్యూరేటర్ ఆశిష్ భౌమిక్ ఇప్పటికే పిచ్‌ను తాయారు చేయడం మొదలు పెట్టినట్లు సమాచారం.
"గౌహతిలోని పిచ్ ఎర్ర మట్టితో తయారు అవుతోంది. సాధారణంగా ఈ ట్రాక్‌పై స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పిచ్‌లో టర్న్ ఉంటే వేగంతో ఎక్కువగా బౌన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ అస్థిరమైన బౌన్స్ లేకుండా ఉండేలా క్యూరేటర్లు ప్రయత్నిస్తున్నారు" అని బీసీసీఐ అధికారి ఒకరు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో పేర్కొన్నారు. కాగా తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.
బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇరు జట్లు బ్యాటర్లు తేలిపోయారు. టెస్టు మొత్తంలో ఒక్క జట్టు కూడా 200 పరుగుల స్కోర్ దాటలేకపోయింది. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ పిచ్ క్యూరేటర్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటింగ్ వైఫల్యమేనని గౌతీ పేర్కొన్నాడు.


