విశాఖపట్నం: ఎక్కడో ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఉన్న యువకుడికి ఉన్నట్టుండి పలు అవయవాల వైఫల్యం సమస్య వచ్చింది. అక్కడి వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి విషయం తెలిపారు. దాంతో డాక్టర్ ఎం. రవికృష్ణ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ బృందం అక్కడకు వెళ్లి, ఆ 25 ఏళ్ల యువకుడికి ఎక్మో పెట్టి, రోడ్డు మార్గంలో అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రిటికల్ కేర్, ఎక్మో విభాగం అధిపతి డాక్టర్ రవికృష్ణ ఇలా తెలిపారు.
‘‘ఈ రోగి ఒక ఇంజినీర్. అతడికి ఉన్నట్టుండి మెదడు, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కాలేయం.. ఇలా అన్ని అవయవాలూ విఫలం అయ్యాయి. భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రి నుంచి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి కబురు రావడంతో వెంటనే ఇక్కడినుంచి ప్రత్యేక ఎక్మో రిట్రీవల్ బృందం అక్కడకు బయల్దేరింది. వెళ్లగానే ఆ ఆస్పత్రిలోనే ఆ యువకుడికి ఎక్మో పెట్టాం. పోర్టబుల్ ఎక్మో కావడంతో అక్కడినుంచి ఆ మిషన్ ఉంచే 500 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చాం. మధ్యలో ఒక్కసారి మాత్రం రక్తపరీక్షల కోసం తప్ప, మరెక్కడా ఆగలేదు.
ఇక్కడకు రాగానే పరీక్షిస్తే.. ఆ యువకుడికి ఊపిరితిత్తులు గాయపడ్డాయని, కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని, మెదడులో రక్తస్రావం అయ్యిందని, కాలేయం.. మూత్రపిండాలు విఫలమయ్యాయని తెలిసింది. ఇంత దూరం పాటు తీసుకొచ్చి రోగిని కాపాడడం చాలా పెద్ద సమస్య. ముందుగానే ఎక్మో పెట్టి తీసుకురావడం అతడి ప్రాణాలను కాపాడడంలో మొదటి ముందడుగు అయ్యింది. దానివల్ల అతడికి అవయవాలు ఇంకా విఫలం కాకుండా ఆగాయి. ఇక్కడకు వచ్చిన తర్వాతే అసలు చికిత్స మొదలైంది. ముందుగా అతడికి నైట్రిక్ ఆక్సైడ్ ఇచ్చాం. అది మెదడులోకి వెళ్లకుండానే పనిచేస్తుంది. దీంతోపాటు అతడికి మెదడులో రక్తస్రావం కాకుండా ఉండేందుకు తగిన చికిత్స చేశాం. ఫలితంగా రోగి వెంటనే కోలుకోవడం మొదలైంది. ఐదు రోజులకల్లా రోగికి ఎక్మో సహా అన్నిరకాల పరికరాలూ తీసేశాం. ప్రాణాపాయం నుంచి అతడు బయటపడ్డాడు.
ప్రధాన సమస్యలన్నీ తీరిన తర్వాత అప్పుడు పూర్తిస్థాయి పరీక్షలు చేస్తే.. రెండేళ్ల నుంచి అతడికి తీవ్రమైన ఆందోళన, చెమటలు పట్టడం లాంటి లక్షణాలున్నట్లు తెలిసింది. దాంతో.. అతడు ఫియోక్రోమోసైటోమా (పీఎంసీ) అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన సమస్య ఉన్నట్లు తెలిసింది. దానికి కారణం.. అడ్రినల్ గ్రంధిమీద ఏర్పడిన క్యాన్సర్ కణితి. ఈ కణితి వల్ల అతడికి చాలా ఎక్కువగా, నియంత్రణ లేకుండా అడ్రినలిన్ స్రవించడం మొదలైంది. అదికూడా అప్పుడప్పుడు మాత్రమే స్రవించడంతో ముందుగా దీనికి పరీక్షలు చేసినా నెగెటివ్ వచ్చింది. లక్షణాలు మాత్రం ఉన్నట్టుండి చాలా తీవ్రంగా వచ్చాయి.
ముందుగా 9 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జి చేశాం. అతడిని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రావణి తన్నా పరీక్షించారు. నాలుగు వారాల తర్వాత అతడికి లాప్రోస్కొపిక్ పద్ధతిలో కణితిని తొలగించారు. సీనియర్ ఎనస్థెటిస్టులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ అప్పలరాజుల పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరిగింది. అనంతరం పరీక్ష చేసినప్పుడు అది మొదటి దశ క్యాన్సర్ అని తేలింది. దాంతో ఇతర భాగాలకు అది విస్తరించలేదు. ఎలాంటి కారణం లేకుండానే ఇలా బహుళ అవయవాల వైఫల్యం వస్తే ఎలాంటి అరుదైన సమస్యలు కారణం అవుతాయనడానికి ఈ కేసు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్మో పెట్టి చికిత్స చేయడానికి చాలా నైపుణ్యం కావాలి.
ఒక రకంగా ఇందులో మెడికల్ డిటెక్టివ్ పని చేయాలి. ఎక్మో పెట్టిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడం, కొన్ని మందులు అస్సలు పడకపోవడం లాంటివి ఇందులో కీలకంగా మారాయి. అందువల్ల అతడికి సాధారణ సెప్సిస్ కాకుండా అరుదైన ఎండోక్రైన్ అత్యవసర పరిస్థితి అయ్యి ఉంటుందని ఆలోచించాం. అప్పుడు అందించిన చికిత్సతో అతడు బాగా కోలుకున్నాడు’’ అని డాక్టర్ రవికృష్ణ వివరించారు.


