సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనూసూద్‌

Sonu Sood Moves Supreme Court Over BMC Notice Row - Sakshi

న్యూఢిల్లీ: నటుడు, సేవా కార్యక్రమాలతో ‘రియల్‌ హీరో’గా నిలిచిన సోనూసూద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. కాగా సోనూసూద్‌కు ముంబైలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ పేరిట ఆరంతస్తుల భవనం ఉంది. అయితే, అనుమతులు తీసుకోకుండానే ఈ నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు.. ఆయనకు నోటీసులు పంపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై, బీఎంసీ అభ్యంతరాలను స‌వాల్ చేస్తూ సోనూసూద్‌ కోర్టును ఆశ్ర‌యించారు. అయితే దిగువ కోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. (చదవండి: సోనూసూద్‌పై బీఎంసీ సంచలన వ్యాఖ్యలు)

కానీ అక్కడ కూడా ఈ ‘రియల్‌ హీరో’కు నిరాశే ఎదురైంది. ‘‘నిజాయతీ గల వారి వైపు న్యాయం ఉంటుంది. ఇప్పుడు బంతి బీఎంసీ చేతిలోకి వెళ్లింది. వారిని సంప్రదించండి’’ అని పేర్కొంటూ బాంబే హైకోర్టు సోనూసూద్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం గురించి సోనూసూద్‌ తరఫు న్యాయవాది వినీత్‌ ధందా మాట్లాడుతూ.. తన క్లైంట్‌ పట్ల బీఎంసీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్‌ ఇమేజ్‌కు భంగం కలిగిలా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాం. నా క్లైంట్‌ అసలు ఆ ప్రాపర్టీ ఓనర్‌ కాదని బీఎంసీ వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఆయనే ఓనర్‌ అని ఆక్రమదారుడు కూడా తనేనని పేర్కొంది. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాం. నా క్లైంట్‌ పట్ల బీఎంసీ చాలా పరుషపదజాలం ఉపయోగించింది. నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తిగా ఆయనను అభివర్ణించింది’’ అని వినీత్‌ పేర్కొన్నారు. సోనూసూద్‌ చట్టాన్ని అతిక్రమించలేదని, నిబంధనలకు లోబడే నడుచుకున్నారని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top