‘సోనూసూద్‌ నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు’

BMC Calls Sonu Sood Habitual Offender Affidavit in Court - Sakshi

ముంబై: ‘రియల్‌ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు సోనూసూద్‌పై బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. నేరాలకు పాల్పడటం ఆయనకు ఓ అలవాటుగా మారిందని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా సోనూసూద్‌ వైఖరి మార్చుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించింది. నివాససముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్‌ లాభాలు పొందాలని భావిస్తున్నారని తెలిపింది. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్‌ డిపార్టుమెంట్‌ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ మేరకు బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో బీఎంసీ సోనూసూద్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తి’’గా ఆయనను అభివర్ణించింది. కాగా ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. అనుమతులు తీసుకోకుండానే ఈ నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ అధికారులు.. నోటీసులు పంపించారు. అయితే సోనూ ఇందుకు స్పందించలేదని పేర్కొంటూ..  పోలీసులకు ఫిర్యాదు చేశారు.(చదవండి: సోనూసూద్‌పై ఫిర్యాదు చేసిన ముంబై అధికారులు)

అయితే తాను అన్ని అనుమతులు తీసుకున్నానన్న సోనూ.. బీఎంసీ అభ్యంతరాలను స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. కానీ దిగువ కోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ఇందుకు సమాధానం ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు, బీఎంసీని ఆదేశించగా.. అఫిడ‌విట్‌లో ఈ మేరకు ఆరోపణలు చేసింది. కాగా లాక్‌డౌన్‌ కాలంలో ఎంతో మంది అభాగ్యులను ఆదుకుని రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. కరోనా పేషెంట్ల కోసం తన హోటల్‌లో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడం, వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top