సోనూసూద్‌పై ఫిర్యాదు చేసిన ముంబై అధికారులు

Police Complaint Against Sonu Sood - Sakshi

ముంబై: కష్టాల్లో ఉన్నవారికి కాదనకుండా సాయం చేసుకుంటూ పోతున్న రియల్‌ హీరో సోనూసూద్‌ వివాదంలో చిక్కుకున్నారు. తన నివాస స్థలాన్ని హోటల్‌గా మార్చినందుకు ముంబై అధికారులు ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోనూకు ముంబైలోని జుహు ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్థుల భవనం ఉంది. అధికారుల అనుమతులు తీసుకోకుండా దీన్ని హోటల్‌గా మార్చారంటూ బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు భవనానికి నోటీసులు పంపించారు. అయినా సరే తమ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని హోటల్‌గా రన్‌ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలను సోనూసూద్‌ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలం ఎమ్‌సీజెడ్‌ఎమ్‌ఏ(మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందన్నారు. అది కూడా కోవిడ్‌-19 వల్ల ఆలస్యం అవుతుందన్నారు. ఒకవేళ అనుమతులు రాకపోతే దాన్ని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తానని చెప్పారు. మరోవైపు దీనిపై పోలీసులు స్పందిస్తూ ప్రాథమిక విచారణ చేపట్టాకే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: విడాకులు తీసుకోబోతున్న స్టార్‌ కపుల్‌)

ఇదిలావుంటే గతంలో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆఫీసును బీఎంసీ అధికారులు కూల్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో బాంద్రాలోని ఆమె ఆఫీసును సగానికి పైగా నేలమట్టం చేశారు. దీన్ని ఆమె రూ. 48 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. కళ్ల ముందే తన కలల సౌధం కూలిపోవడంతో కంగనా ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో ఆమెకు, శివసేన పార్టీకి మధ్య కొంతకాలం పాటు మాటల యుద్ధం జరిగింది. (చదవండి:కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top