
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని జాతి వ్యతిరేకిగా మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభివర్ణించారు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడటమే గాక రాజ్యంగ వ్యవస్థలన్నింటినీ తన తాబేదార్లుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం ఓ పత్రికకు ఆమె వ్యాసం రాశారు.
రాజ్యాంగ విజయం పాలకుల ప్రవర్తనపైనే ఆధారపడుతుందని అంబేడ్కర్ పదేపదే హెచ్చరించేవారని గుర్తు చేశారు. మోదీ సర్కారు దెబ్బకు దేశంలో స్వేచ్ఛ పూర్తిగా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ‘‘చట్టాలను ప్రజల హక్కుల పరిరక్షణకు బదులుగా వారిని వేధించేందుకు ఉపయోగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే విద్వేష వాతావరణం సృష్టించి సమాజంలో సౌభ్రాతృత్వాన్ని మంటగలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలే నడుం బిగించాలి’’ అని పిలుపునిచ్చారు.