ఆలయానికి కొత్తగా సీఈఓ | Shri Ram Janmabhoomi Trust accepts Champat Rai resignation | Sakshi
Sakshi News home page

ఆలయానికి కొత్తగా సీఈఓ

Jul 7 2026 1:37 AM | Updated on Jul 7 2026 1:37 AM

Shri Ram Janmabhoomi Trust accepts Champat Rai resignation

చందా చోరీ ఉదంతంతో మసకబారిన అయోధ్య రామమందిర ప్రతిష్టను పునరుద్ధరించేందుకు చర్య 

ముగ్గురు సభ్యుల కమిటీకి సీఈఓ ఎంపిక బాధ్యతలు 

చంపత్‌ రాయ్‌ రాజీనామా ఆమోదం 

తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా  కృష్ణ మోహన్‌ నియామకం 

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక భేటీలో నిర్ణయాలు

అయోధ్య: రామమందిర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బీజేపీ, సంఘ్‌ పరివార్‌లు అయోధ్య రామమందిరంలో కోట్ల రూపాయల చందా చోరీ ఉదంతంతో మసకబారిన ఆలయ ప్రతిష్ట పునరుద్ధరించేందుకు నడుంబిగించాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేలా కొత్తగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ) పదవిని ఏర్పాటుచేయాలని సోమవారం జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక భేటీలో నిర్ణయించారు. సీఈఓ పదవికి అర్హతలున్న వ్యక్తి ఎంపిక బాధ్యతలను ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించారు.

ఈ కమిటీలోకి సభ్యులుగా విశ్రాంత న్యాయమూర్తి ప్రమోద్‌ కోహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ విష్ణుకాంత్‌ చతుర్వేది, ట్రస్టీ సురేశ్‌ హవారేలను తీసుకున్నారు. లక్షలాది మంది భక్తులు సమరి్పంచిన నగదు, స్వర్ణాభరణ కానుకలను కాజేసిన ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేస్తూ చంపత్‌ రాయ్‌ తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం ఆలయ కాంప్లెక్స్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం మూడుగంటలపాటు జరిగిన భేటీలో ట్రస్ట్‌ సభ్యులు ఆమోదించారు. ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా రాజీనామానూ ఆమోదించారు. ప్రస్తుతం ట్రస్టీగా ఉన్న కృష్ణమోహన్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకు న్నారు. 

ఎవరైనా వచ్చి సరిచూసుకోవచ్చు: కృష్ణమోహన్‌ 
భేటీ తర్వాత తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రామమందిరానికి భారీ స్థాయిలో బంగారం, వెండి, ఇతరత్రా అత్యంత విలువైన ఆభరణాలు, వస్తుసామగ్రిని ఇచ్చిన దాతలు తామిచ్చిన విరాళాలు ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు అవకాశం కల్పిస్తాం. నగదుకాని 2,926 కానుకల సంబంధ రికార్డులు, డాక్యుమెంట్లను బహిరంగంచేస్తాం. ఎవరైనా వచ్చి వాటిని సరిచూసుకోవచ్చు. చోరీకి పాల్పడిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం. చోరీ ఘటనతో ఆలయంపై ఆరోపణల మచ్చ పడింది.

ఇలాంటివి పునరావృతంకాకుండా, మళ్లీ ప్రజల విశ్వాసం చూరగొనేలా ట్రస్ట్‌ సభ్యులంతా ఎంతో పారదర్శకంగా పనిచేస్తారు. ఆలయాన్ని మరింత సమర్థవంతంగా, ఆదర్శప్రాయంగా నిర్వహించేందుకు, నిపుణుల నుంచి సలహాలు తీసుకోబోతున్నాం’’అని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్‌ అన్నారు.

శతాబ్దాలపోరాట ఫలితంగా సాకారమైన ఆలయంలో కొంతకాలంగా హుండీల నుంచి విరాళాలు చోరీ అవుతున్నాయన్న విషయం తెలియగానే ట్రస్ట్‌ సభ్యులు, భక్తులు ఎంతో కలతచెందారని, ఇది నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి అని ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌దేవ్‌ గిరి వ్యాఖ్యానించారు. ఈనెల 22వ తేదీన ట్రస్ట్‌ మరోసారి సమావేశంకానుంది. సోమవారంనాటి భేటీలో ట్రస్ట్‌ చైర్మన్‌ నృత్యగోపాల్‌ దాస్‌సహా ఏడుగురు శాశ్వత సభ్యులు హాజరయ్యారు. సాయంత్రం ఆరున్నరదాకా భేటీ కొనసాగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement