మిగతా ఔషధాల ధరలెందుకు తగ్గించరు?  | SC questions Centre on trade margin cap, seeks wider price regulation | Sakshi
Sakshi News home page

మిగతా ఔషధాల ధరలెందుకు తగ్గించరు? 

Oct 13 2026 6:39 AM | Updated on Oct 13 2026 6:39 AM

SC questions Centre on trade margin cap, seeks wider price regulation

క్యాన్సర్‌ మందుల ధరలపై పరిమితి విధించామన్న కేంద్రానికి సుప్రీం ప్రశ్న 

రూ.11 ఖరీదు చేసే సెలైన్‌ బాటిల్‌ను రూ.270కి విక్రయిస్తున్నారని నిలదీత

న్యూఢిల్లీ: క్యాన్సర్‌ ఔషధాల గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పి)లో వ్యాపారులకు మార్జిన్‌ 30 శాతం మించకుండా పరిమితి విధించామంటూ కేంద్రం ఇచ్చిన సమాధానంపై సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్యులకు తీవ్ర భారంగా మారిన మిగతా ఔషధాల ధరలను ఎందుకు తగ్గించరంటూ ప్రశ్నించింది. యాంటీ క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

 దీంతో, ఔషధాల ధరలు 20 నుంచి 70 శాతం మేరకు తగ్గనున్నాయని, దేశంలోని రోగులకు రూ.2,500 కోట్ల మేర ఆదా అవుతాయంటూ విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. అక్టోబర్‌ 8వ తేదీన జరిగిన నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) 151వ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ మేరకు 551 పేజీల అఫిడవిట్‌ను సమరి్పంచారు. 

స్పందించిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం.. కేంద్రం స్పందన సంతృప్తికరంగా లేదని పేర్కొంది. ఒక బాటిల్‌ సెలైన్‌ తయారీకి ఖర్చు కేవలం రూ.11 మాత్రమే కాగా, మార్కెట్‌లో ఏకంగా రూ.270కి విక్రయిస్తున్నారని ధర్మాసనం ప్రస్తావించింది. ‘కేంద్రం తాజా నిర్ణయంతో ఇలాంటి వాటి ధరల్లో ఎలాంటి మార్పు రాదు. రోగులకు ఏ ప్రయోజనమూ కలగదు’అని వ్యాఖ్యానించింది. క్యాన్సర్‌ మందుల ధరలపై మాత్రమే పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం, ఇతర అన్ని ఔషధాలను సైతం దీని పరిధిలోకి ఎందుకు రావడం లేదు?’అని ప్రశ్నించింది. 

‘ఔషధాల ఉత్పత్తికి రవాణా, సామగ్రి, పరిశోధన, అభివృద్ధి, ఇతర అనుబంధ ఖర్చులు చాలానే ఉంటాయని మాకు కూడా తెలుసు. ఇవన్నీ ఎమ్మార్పిలో కలిసే ఉంటాయి. అయితే, వాస్తవ ఖర్చుకు 400 రెట్లు ఎక్కువగా ఔషధారల ధరలు ఎందుకు ఉండాలి? మీరు ఎలా అనుమతిస్తున్నారు?’అని ధర్మాసనం తుషార్‌ మెహతాను నిలదీసింది. భారత్‌లో మందుల ధరలు ప్రపంచంలోనే అతి తక్కువని, అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి పేర్కొనగా.. ‘భారత్‌ తయారీ గుండె స్టంట్‌ ధర రూ.5 వేలే కాగా, ఆస్పత్రుల్లో రూ.25 వేలు వస్తున్నారు.

 అదేవిధంగా, యాంటీ బయాటిక్‌ అజిత్రోమైసిన్‌ అసలు ధర రూ.28 కాగా, రూ.70కి విక్రయిస్తున్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఎక్కువ మార్జిన్లు ఉన్నప్పుడే ఆ ఔషధాలు సుదూర ప్రాంతాలకు సైతం సరఫరా అయ్యే అవకాశం ఉంటుందని తుషార్‌ మెహతా చెప్పుకొచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఔషధాలను అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. మందుల ధరలపై విధించే పరిమితికి సంబంధించిన విధివిధానాలతో రావాలని కేంద్రాన్ని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. సెపె్టంబర్‌ 28వ తేదీన 16 శాతం ఏకరూప మార్జిన్‌ కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘రిటైలర్‌కు రూ.2,700కే లభించే ఒక క్యాన్సర్‌ డ్రగ్‌ను ఏకంగా రూ.27 వేలకు విక్రయించడం దారుణం. పట్టపగలే నిలువు దోపిడీ’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement