
మరణ శిక్ష అమలు విధానాన్ని మార్చలేరా?
కేంద్రంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం
ఉరిశిక్ష రద్దుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశంలో మరణ శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణ శిక్ష పడిన దోషులకు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆక్షేపించింది. కాలానుగుణంగా మారడానికి సిద్ధంగా లేదని తప్పుపట్టింది.
దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని రద్దు చేయాలని, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష అమలు చేయాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మరణ శిక్ష ఎలా అమలు చేయాలన్న సంగతి దోషికే వదిలివేయాలని పిటిషనర్ వాదించారు.
ఉరిశిక్షా? లేక ప్రాణాంతక ఇంజెక్షనా?.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొనే అవకాశం దోషికి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక ఇంజెక్షనే సరైన విధానమని పేర్కొన్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, 49 రాష్ట్రాల్లో ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఉరిశిక్ష అత్యంత క్రూరమైనది, అనాగరికమైనదని, దోషి ప్రాణం పూర్తిగా పోవడానికి మృతదేహాన్ని దాదాపు 40 నిమిషాలపాటు ఉరికొయ్యకు వేలాడదీస్తారని చెప్పారు. ఉరిశిక్షతో పోలిస్తే ఇంజెక్షన్ విధానంలో ప్రాణం త్వరగా పోతుందని, ఇది మానవీయంగా, గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అది ప్రభుత్వ విధాన నిర్ణయం
మరణ శిక్ష అమలు చేసే విషయంలో అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదికి జస్టిస్ సందీప్ మెహతా స్పష్టంచేశారు. సదరు న్యాయవాది స్పందిస్తూ... శిక్ష విషయంలో దోషికి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టంచేశామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మెహతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా? అని ప్రశ్నించారు. కాలానుగుణంగా ప్రభుత్వం మారకపోవడమే అసలు సమస్య అని అన్నారు.
దోషికి ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేయడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అఫిడవిట్‌లో ప్రస్తావించామని న్యాయవాది గుర్తుచేశారు. ఈ విషయంలో 2023 మే నెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును ప్రస్తావించారు. మరణశిక్ష ఎలా అమలు చేయాలన్నదానిపై సమీక్ష కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నట్లు ఆ ఉత్తర్వులో కోర్టు వెల్లడించింది. కమిటీ ఏర్పాటు అంశం ఏమైందన్న సంగతిని ప్రభుత్వం వద్ద ఆరా తీస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దాంతో తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభుత్వాన్ని ఆదేశించలేం
అడ్వొకేట్ రిషీ మల్హోత్రా 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్ మొగ్గుచూపిందని పేర్కొన్నారు. 187వ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. ఇప్పుడున్నర ఉరిశిక్ష స్థానంలో తక్కువ నొప్పితో కూడిన శిక్ష విధానాలను అమల్లోకి తీసుకురావాలని వాదించారు. ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా తుపాకీతో కాల్చడం లేదా విద్యుత్ షాక్ ఇవ్వడం లేదా గ్యాస్ చాంబర్‌లోకి పంపించడం విధానాలను సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ సమర్పించింది. ఉరిశిక్షను రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాజాగా మరోసారి విచారణ జరిగింది. మరణశిక్షను అమలు చేసే విషయంలో ఒక కచ్చితమైన విధానం పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ధర్మాసనం వెల్లడించింది.