‘స్పుత్నిక్‌’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి

Russia hopes approval to Sputnik-V vaccine by DCGI Will be completed - Sakshi

డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు 

రష్యా వ్యాక్సిన్‌ 91.6 శాతం ప్రభావవంతం

డీజీజీఐ అనుమతిస్తే ఇండియాలో మూడో కరోనా టీకా అందుబాటులోకి..

న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) సిఫార్సు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని  డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ సంస్థ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ సైతం ఆమోదిస్తే స్పుత్నిక్‌ టీకా భారత్‌లో అందుబాటులోకి వస్తుంది.

దేశంలో ప్రజలకు అందే మూడో కోవిడ్‌–19 టీకా ఇదే అవుతుంది. అన్ని అనుమతులు లభిస్తే స్పుత్నిక్‌ టీకాను అత్యవసర వినియోగం కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్, సరఫరా హక్కులను డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)తో భాగస్వామిగా మారింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో నిర్ధారణ అయ్యింది.  డీసీజీఐ భారత్‌లో  కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాల  అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top