దసరా పండుగ సందర్భంగా కొత్త జ్యువెలరీ షోరూమ్‌లో జరిగినచోరీ సంచలనంగా మారింది. ఓపెన్‌కు సిద్ధంగా ఉన్న క్షణాల్లోనే రూ. 8.28 కోట్ల విలువైన 5.5 కిలోల బంగారు ఆభరణాలు మాయమైన ఘటనకలకలం రేపింది. గుజరాత్‌లోని వడోదర నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే షాకవ్వాల్సిందే. స్థానిక సాయి గణేష్ కాంప్లెక్స్‌లో 'శ్రీ అంబికా జ్యువెలర్స్' అనే కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం కోసం ముంబై నుండి భారీగా బంగారు ఆభరణాలు తెప్పించారు. సేల్స్ మేనేజర్ వాష్‌రూమ్‌కి వెళ్లిన కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే రెండు బ్యాగుల్లో ఉన్న అయిదున్నర కిలోల బంగారాన్ని కొట్టేశారు. ఈ ఘటనపై ముంబైకి చెందిన 'యుగన్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్' సేల్స్ మేనేజర్ హిమాంశు జైన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వడోదరలోని 'బాపోద్' (Bapod) పోలీస్ స్టేషన్‌లోకేసు నమోదైంది.
ఘటన జరిగిన తీరిది..
ఫిర్యాదుదారు హిమాంశు జైన్‌కు గుజరాత్‌లోని దకోర్ (Dakor) ప్రాంతంలో జ్యువెలరీ షాప్ నడుపుతున్న భవిక్‌కుమార్ సోని అనే వ్యాపారవేత్తతో 2017 నుండి పరిచయం ఉంది. దసరా సందర్భంగా వడోదరలో ప్రారంభించబోయే తన కొత్త షోరూమ్ కోసం సోని పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల ఆర్డర్ ఇచ్చాడు. దాంతో ఆదివారం హిమాంశు జైన్ రూ. 8.28 కోట్ల విలువైన 5.5 కిలోల బంగారాన్ని వడోదరకు తీసుకువచ్చారు.
షోరూమ్‌లో ఆభరణాలను ఉంచి సోని, హిమాంశు జైన్ సోదరుడు నీల్ ఇద్దరూ భోజనానికి బయటకు వెళ్లారు. ఆ సమయంలో రెండు బంగారం బ్యాగులు సురక్షితంగా ఉంటాయని సోని వారికి హామీ ఇచ్చి, షాపుకు బయటి నుండి తాళం వేసి వెళ్లాడు. అదే సమయంలో జైన్ వాష్‌రూమ్‌కి వెళ్లారు.
జైన్ దాదాపు 12 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి షాప్ తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లేసరికి ఇతర ఆభరణాలు అక్కడే ఉన్నప్పటికీ, బంగారం ఉన్న రెండు ప్రధాన బ్యాగులు కనిపించకుండా పోయాయి. దీంతో ఒక్కసారిగా షాకైన జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం నీలం రంగు టూ-వీలర్‌పై వచ్చిన ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఆ బంగారు బ్యాగులతో పారిపోతున్నట్లు కనిపించింది.
ఇదీ చదవండి: రూ. 1500 కోట్ల సామ్రాజ్యం : అప్పట్లో ఆలూ, ఉల్లి, మరిప్పుడు?
మరోవైపు భోజనానికి వెళ్లిన ప్రధాన అనుమానితుడు భవిక్‌కుమార్ సోని, మార్గమధ్యలో తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. దీంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. పెద్ద మొత్తంలో బంగారం ఆర్డర్ ఇవ్వడం, షాప్ ఓపెనింగ్ ఇదంతా పక్కాప్లాన్‌తో చేసిన చోరీ అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) జి.బి. బాభణియా తెలిపారు. షాపు తాళం తీసి వారు లోపలికి ఎలా ప్రవేశించారనే దానిపైదర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వడోదర పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఆధారాలు, సాంకేతిక సర్వేలెన్స్ సహాయంతో నిందితుల కోసం వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: పాపులర్ టీవీ యాక్టర్ ఆత్మహత్య , రీల్ తండ్రి భావోద్వేగం


