
హుబ్లీ వద్ద లారీని ఢీకొన్న కారు
తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం
శివమొగ్గ జిల్లాలో నిశ్చితార్థం చేసుకుని వెళ్తుండగా ఘోరం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.
హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు...
ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు.
8:30 సమయంలో..
రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
లారీలో చిక్కుకున్న కారు
కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.