సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి | Revanth Reddy appeals to Union Minister Ashwini Vaishnav | Sakshi
Sakshi News home page

సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి

Jul 18 2025 4:48 AM | Updated on Jul 18 2025 4:48 AM

Revanth Reddy appeals to Union Minister Ashwini Vaishnav

గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 

రీజనల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి 

ఖాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సెమీకండక్లర్‌ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ (ఏఎస్‌ఐపీ) ప్రాజెక్టు, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ప్రాజెక్టు క్రిస్టల్‌ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెలపాలని కోరారు.

రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం రైల్‌ భవన్‌లో అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్‌ ఎల్రక్టానిక్స్‌ పార్క్‌ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ ఇచ్చిన వినతిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్‌ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎల్రక్టానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రీజినల్‌ రింగు రైలుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.  

హైదరాబాద్‌ డ్రైపోర్టు–బందరు లైన్‌ మంజూరు చేయండి  
రాష్ట్రంలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని..ఇందుకు రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ‘రీజినల్‌ రింగ్‌ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరగడంతో పాటు హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది..’అని చెప్పారు. హైదరాబాద్‌ డ్రైపోర్టు నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కోరా రు. ఔషధాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉ త్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందన్నారు. 

కొత్త రైలు మార్గాలు మంజూరు చేయండి 
ఖాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖాజీపేట రైల్వే డివిజన్‌ అవసరమని తెలిపారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవల కోసం దీనిని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం.. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

వికారాబాద్‌–కృష్ణా (122 కి.మీ.–అంచనా వ్యయం రూ.2,677 కోట్లు) కల్వకుర్తి–మాచర్ల (100 కి.మీ.–అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు), డోర్నకల్‌–గద్వాల (296 కి.మీ.–అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్‌–మిర్యాలగూడ (97 కి.మీ.–అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్‌ షెట్కార్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement