సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించండి: యూపీ

UP Request Supreme Court To Monitor CBI Probe In Hathras Case - Sakshi

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన యూపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ/లక్నో: హాథ్రస్‌ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అదే విధంగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరింది. అదే ఫైల్‌ను యూపీ పోలీస్‌ చీఫ్‌ ద్వారా సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని, కాబట్టి తమ అభ్యర్థనను మన్నించాల్సిందిగా యోగి సర్కారు విజ్ఞప్తి చేసింది. ఇక బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బాధిత కుటుంబ నివాస ప్రాంగణంలో ఎనిమిది సీసీటీవీలను బిగించామని, తద్వారా నిరంతరం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గురువారం తదుపరి విచారణ చేపట్టనుంది. (చదవండి: హథ్రస్‌లో మరో ఘోరం!)

సామూహిక అత్యాచారానికి గురై, అత్యంత దారుణ పరిస్థితుల్లో ఢిల్లీ ఆస్పత్రిలో మరణించిన 20 ఏళ్ల దళిత యువతి మృతి కేసులో సీబీఐ మంగళవారం విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్‌ నిపుణులతో సహా నేరం జరిగిన చోటుకు వెళ్లిన దర్యాప్తు బృందం, బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె తల్లి, సోదరుడిని క్రైంసీన్‌ వద్దకు తీసుకువెళ్లి వివరాలు సేకరించింది. అనంతరం, అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేసిన చోటుకు వెళ్లి పరిశీలించింది. ఇక ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ సైతం విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.(చదవండి: అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే)

కాగా.. ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాథ్రస్‌ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top