
ఢిల్లీ: కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? ఏందుకా? బతుకు? అనే ఇతరుల సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. గురుగ్రామ్‌లో తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన రాష్ట్ర స్థాయి టెన్నీస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యకేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గురువారం రాత్రి గురుగ్రామ్‌లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణిని రాధికా యాదవ్ (25)ను ఆమె త్రండి దీపక్ యాదవ్ (49) తుపాకీతో కాల్చి చంపాడు. అయితే, ఈ దారుణం జరగడానికి కారణం రాధికా యాదవ్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తుంటుంది. ఇదే విషయంలో దీపక్ యాదవ్.. రాధికాను మందలించారు. పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తూ కూతురు తన పరువు తీస్తోందని భావించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తేలింది.
ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో రాధికా యాదవ్ మరణానికి అసలు కారణంగా ఆమె ఇన్ స్టా రీల్స్ చేయడం కాదని నిర్ధారించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తేలింది.
రాధికా యాదవ్‌కు టెన్నిస్ అంటే ప్రాణం. ఓ సానియా మిర్జా, సెరెనా విలియమ్స్‌లా రాణించాలని అనుకుంది. అందుకు తగ్గట్లుగానే చిన్ననాటి నుంచి టెన్నీస్‌లో తర్ఫీదు పొందింది. రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టెన్నీస్ మ్యాచ్‌లలో అసాధారణమైన ఆటతీరుతో తనకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉందని నిరూపించింది.
కానీ, అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.కొద్ది కాలం క్రితం జరిగిన రాష్ట్రస్థాయి టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయమైంది. దీంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అప్పుడే నేను ఆటకు దూరమైతేనేం. నాలాగా టెన్నీస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహిస్తే సరిపోతుంది కదా అని అనుకుంది. అనుకున్నదే తడవుగా కుటుంబసభ్యులు,గురువుల సహకారంతో టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది.
అనతికాలంలో తన కోచింగ్‌తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రి దీపక్ యాదవ్ కూడా తనకు చేదోడు వాదోడుగా నిలిచారు. అదిగో అప్పుడే.. మనం కష్టాల్లో ఉంటే సంతోష పడేవాళ్లు.. సంతోషంగా ఉంటే ఈర్ష, అసూయతో కుళ్లుకునే వాళ్లు ఉంటారనే నానుడిని నిజం చేశారు దీపక్ యాదవ్ ఇరుగు పొరుగు వారు.

దీపక్ యాదవ్ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇతరులు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. ఆ మాటలు తట్టుకోలేక కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు.
‘నేను ఇంట్లో నిత్యవసర వస్తువుల కోసం, లేదంటే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళుతుంటాను. అలా నేను బయటకు వెళ్లిన ప్రతీసారి ఇతరులు నన్ను సూటిపోటి మాటలతో హింసించేవారు. కూతురు సంపాదన మీద బ్రతుకుతున్నావా?. ఎందుకా బతుకు? అనే మాటలు నన్ను ఎంతగానో బాధించేవి. వాటిని నేను పట్టించుకునే వాడిని కాదు. కొందరు నా కూతురి వ్యక్తిత్వంపై అనుచితంగా మాట్లాడారు. ఈ వరుస సంఘటనలు నన్ను మానసికంగా కుంగదీసాయి. నా కూతుర్ని టెన్నిస్ అకాడమీని మూసేయమని చెప్పాను. కానీ ఆమె తిరస్కరించింది. నాలో సహనం నశించింది. ఆమె వంటచేస్తున్నపుడు వెనుక నుండి నా లైసెన్స్డ్ రివాల్వర్‌తో మూడు రౌండు కాల్పులు జరిపాను. నా కూతురిని నేనే హత్య చేశాను’ అని దీపక్ యాదవ్ పోలీసుల ఎదుట కన్నీరుమున్నీగా విలపించారు.

పోలీసుల ప్రకారం.. మృతురాలు రాధికా యాదవ్ మామ కుల్‌దీప్ యాదవ్ దారుణం ఎలా జరిగిందో పోలీసులకు కళ్లకు కట్టిన వివరించారు. గురువారం ఉదయం 10:30కు గట్టి శబ్దం వినిపించడంతో, ఆయన దీపక్ నివసించే మొదటి అంతస్థుకు పరుగెత్తారు. నాకు గన్ను పేలిన శబ్ధం వినిపించింది. మొదటి ఫ్లోర్‌కి వెళ్లగా నా మేనకోడలు రాధికా వంటగదిలో రక్తపు మడుగులో పడి ఉంది. డ్రాయింగ్ రూమ్‌లో రివాల్వర్ కనిపించింది. ఆ తర్వాత నా కుమారుడు పీయూష్ యాదవ్‌తో కలిసి మేము ఆమెను కారులో తీసుకుని ఆస్పత్రికి తరలించాం. వైద్యుడు ఆమెను పరీక్షించిన తర్వాత ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆమె గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి… చాలా ట్రోఫీలు గెలుచుకుంది. ఆమె హత్యకు కారణం నాకు అర్థం కావడం లేదు.
ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఎందుకు హత్య జరిగింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను మొదటి అంతస్థు (ఫ్లోర్)కి వెళ్లినప్పుడు దీపక్, మంజు యాదవ్, రాధికా మాత్రమే అక్కడ ఉన్నారు ’అని కుల్‌దీప్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.