Break The Chain: లాక్‌డౌన్‌పై ఉత్కంఠ!

Rajesh Tope Hints At Extension Of Lockdown In Maharashtra - Sakshi

ప్రజల్లో అనేక సందేహాలు 

15వ తేదీతో ముగియనున్న ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు 

త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి రాజేశ్‌ టోపే

సాక్షి, ముంబై: బ్రేక్‌ ద చైన్‌లో భాగంగా గత నెల 14వ తేదీన అమలు చేసిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 15వ తేదీ ఉదయం ఏడు గంటలతో ముగుస్తుంది. ఆ తరువాత లాక్‌డౌన్‌ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అలాగే కొనసాగిస్తుందా? లేక ఎత్తివేస్తుందా? ఏమైనా సడలింపులుంటాయా? ఇలా అనేక సందేహాలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కాగా ముంబైలో విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు సత్ఫలితాలనిచ్చాయి. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ముంబైకర్లలో కొంత ఆశలు చిగురించాయి. షాపులు, లోకల్‌ రైలు, ఇతర రవాణ వ్యవస్థలో  సడలింపులిస్తే బాగుంటుందని ముంబైకర్లు ఆశతో ఉన్నారు. చివరకు శనివారం ఈ సందేహాలపై ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే స్పందించారు.

ప్రస్తుతం ముంబైలో కరోనా వైరస్‌ చాలా శాతం వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ రాష్ట్రంలోని అనేక జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అక్కడ బీతావహ వాతావరణం ఉండటంతో జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉందన్నారు. ఫలితంగా కొన్ని జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినం చేయాల్సి వచ్చిందని వివరించారు. దీన్ని బట్టి ముంబైతోపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

తగ్గని పాజిటివ్‌ రేటు 
రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజుకు సుమారు 60–65 వేల వరకు నమోదైతున్నాయి. పాజిటివ్‌ రేటు ఇంతవరకు తగ్గుముఖం పట్టలేదు. కాగా రాష్ట్రంలోని 36 జిల్లాలో కేవలం 12 జిల్లాలో పాజిటివ్‌ రేటు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కొన్ని జిల్లాల్లో స్థిరంగా ఉండగా మరికొన్ని జిల్లాల్లో పెరుగుతోంది. కానీ మృతుల సంఖ్య అనుకున్నంత మేర తగ్గడం లేదన్నారు. రాష్ట్రంలో శుక్రవారం 54,022 కరోనా కేçసులు నమోదయ్యాయి. 37,386 రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రం లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,54,788 ఉండగా శుక్రవారం ఒక్కరోజే 898 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో అత్యధిక మృతులు నాసిక్‌ జిల్లా కు చెందిన వారున్నారని రాజేశ్‌ టోపే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేయాలా? లేక అలాగే కొనసాగించాలనే దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని రాజేశ్‌ టోపే స్పష్టం చేశారు.   

చదవండి: (180 జిల్లాల్లో కనిపించని వైరస్‌ జాడ) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top