వీడియో: గ్యాంగ్‌వార్‌.. పట్టపగలు బుల్లెట్ల వర్షం.. గ్యాంగ్‌స్టర్‌ రాజు దారుణ హత్య

Rajasthan Gangster Raju Theth Shot Dead - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో గ్యాంగ్‌ వార్‌.. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలే హైప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందే నలుగురు దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. శనివారం ఉదయం 9.30గం. ప్రాంతంలో సికార్‌ నగరం పిప్రాలి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

దుండగులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి.. రాజు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారం. షెకావతి ప్రాంతానికి చెందిన మరో గ్యాంగ్‌తో రాజుకి వైరం ఉందని, బహుశా ఆ ముఠానే ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. హత్య తర్వాత గాల్లోకి కాల్పులు జరుపుతూ జనాలను భయపెట్టుకుంటూ ముందుకు వెళ్లింది ఆ ముఠా. అయితే..

ఇక ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. రోహిత్‌ గొదార అనే వ్యక్తి కాల్పులకు తానే బాధ్యుడినంటూ ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించుకోవడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే.. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడినే అంటూ అతను పరిచయం చేసుకున్నాడు. ఆనంద్‌ పాల్‌ సింగ్‌, బల్బిర్‌ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ప్రకటించుకున్నాడు రోహిత్‌. 


గ్యాంగ్‌స్టర్‌ రాజు(పాత చిత్రం)

ఆనంద్‌పాల్‌ గ్యాంగ్‌కు చెందిన బనుదా.. జులై 2014లో బికనీర్‌ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇదిలా ఉంటే.. థెట్‌ వర్గీయులు అతని మరణానికి సంఘీభావంగా స్థానికంగా దుకాణాలు మూయించేశారు. నిందితులను అరెస్ట్‌ చేయకపోతే ఆందోళన చేపడతామని పోలీసులను హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: గుండెపోటుతో డ్రైవర్‌ మృతి.. బస్సు బీభత్సం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top