ఐక్యంగా ఎదుర్కొందాం | Rahul Gandhi Visits Pahalgam Terror Attack Victims In Srinagar, Says Stand United And Defeat Terrorism | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ఎదుర్కొందాం

Apr 26 2025 4:54 AM | Updated on Apr 26 2025 10:40 AM

Rahul Gandhi Visits Pahalgam Terror Attack Victims In Srinagar

ముష్కర మూకల కుట్రలను తిప్పికొడదాం 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పిలుపు 

పహల్గాం ఉగ్రదాడి బాధితుడికి పరామర్శ 

శ్రీనగర్‌: దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఉగ్రవాదం అంతం కావడం ఖాయమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందని అన్నారు. కలిసి ఉంటున్న సోదరుల మధ్య గొడవలు పెట్టాలన్నదే ముష్కరుల ఉద్దేశమని ఆరోపించారు. 

ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడానికి మనమంతా ఒక్కటై చేతులు కలపాలని సూచించారు. ఐక్యమత్యమే మన బలమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి యావత్‌ దేశం ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని సైనిక ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుడిని పరామర్శించారు. 

అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితుడికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పహల్గాం దాడి అత్యంత దారుణమని చెప్పారు. ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్‌ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన సానుభూతి ఉంటుందని పేర్కొన్నారు. 

ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు పూర్తి మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రజలపై దాడుల జరుగుతుండడం విచారకరమని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. మన సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని కోరారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌ వ్యాపారులు, విద్యార్థి సంఘాల నాయకులు, పర్యాటక రంగ ప్రతినిధులతో రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement