Twitter: ఎట్టకేలకు రాహుల్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

Rahul Gandhi Twitter Account Restored After A Week - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాహుల్‌ గాంధీ కొన్ని నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఖాతాను ట్విటర్‌ నిషేధించిన విషయం తెలిసిందే. ఖాతాను నిలిపివేయడంపై రాజకీయ దుమారం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం రాహుల్‌ తీవ్రంగా విమర్శలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో ట్విటర్‌ తలదూర్చిందని యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి: రాజకీయాల్లో ట్విట్టర్‌ తలదూరుస్తోంది)

విమర్శలు చేసిన మరుసటి రోజే శనివారం ట్విటర్‌ రాహుల్‌ ఖాతాను పునరుద్ధరించింది. రాహుల్‌ ఖాతాను తిరిగి తెరిచింది (అన్‌లాక్‌). ఇటీవల ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాహుల్‌ తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శి వారితో దిగిన ఫొటోలను ఆగస్ట్‌ 4వ తేదీన ట్విటర్‌ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విటర్‌లో పోస్టులు చేశారు. ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ట్విటర్‌ రాహుల్‌ గాంధీ ఖాతాతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు 5 వేల మంది ఖాతాలను నిలిపివేసింది. కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా, రోహన్‌ గుప్తా, పవన్‌ ఖేరా, మాణిక్కం ఠాగూర్‌తో పాటు రాహుల్‌ వివాదాస్పద ట్వీట్లను డిలీట్‌ చేయడంతో ట్విటర్‌ వారి ఖాతాలను పునరుద్ధరించింది. రాహుల్‌ను రెండు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

ట్విటర్‌ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇతరుల ప్రైవసీ.. భద్రత దృష్ట్యా మేం తప్పనిసరిగా నియమాలు పాటించాల్సి ఉంది. ఆ ఫొటో పోస్టు చేయడంపై మా ప్రతినిధులు పరిశీలించి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో భాగంగా చర్యలు తీసుకున్నాం. మా విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు రాహుల్‌ గాంధీ ఓ లేఖ రాశారు.’ అని వివరించారు.

రాహుల్‌ ఫొటో ఉంచడంపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితుల కుటుంబం ఫొటోలు ఉంచిన రాహులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ క్రమంలోనే రాహుల్‌ ట్విటర్‌ ఖాతాను నిలిపివేసినట్లు తెలిసింది. ఖాతా పునరుద్ధరణపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఒక్క వాక్యం ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్‌ చేసింది. అంటే చివరకు సత్యమే గెలిచిందని పేర్కొంటూ ఆ ట్వీట్‌ చేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top