‘మరణంలోనూ మానవ హక్కులను కాలరాశారు’

Rahul Gandhi Slams UP Government On Hathras - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి సర్కార్‌పై విపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. ఇక కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వరుస ట్వీట‍్లలో యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు సామూహిక అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిన యువతి భౌతిక కాయాన్ని పోలీసులు హడావిడిగా దహనం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. (యూపీలో ‘నిర్భయ’)

దళితులను అణిచివేస్తూ సమాజంలో వారి స్ధానం ఏంటో యూపీ ప్రభుత్వం చూపుతోందని, ఇది సిగ్గుచేటని రాహుల్‌ పేర్కొన్నారు. ‘భారత కుమార్తె లైంగిక దాడికి గురైంది..వాస్తవాలను దాచి ఆపై అంత్యక్రియలు జరుపుకునే హక్కును సైతం బాధిత కుటుంబానికి ఇవ్వకుండా వేధించారు..ఇది తీవ్ర అన్యాయ’మని రాహుల్‌ మరో ట్వీట్‌లో యోగి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై రాహుల్‌ సోదరి,  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

యోగి వైదొలగాలి : ప్రియాంక
హత్యాచార ఘటనపై తాను బాధితురాలి తండ్రితో మాట్లాడానని ఆమె చెప్పారు. తన బిడ్డకు న్యాయం జరగాలని ఆయన తనతో చెప్పారని ప్రియాంక ట్వీట్‌ చేశారు. తన కుమార్తె భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపే అవకాశాన్నీ తనకు ఇవ్వలేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చివరికి మరణంలోనూ వారి మానవ హక్కులను కాలరాశారని ప్రియాంక యూపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కును మీరు కోల్పోయారని యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి ఆమె ట్వీట్‌ చేశారు.

కాగా, యూపీలోని హత్రాస్‌లో పశుగ్రాసం కోసం తల్లితో కలిసి ఈనెల 19న పొలానికి వెళ్లిన యువతిపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమెను తీవ్రంగా గాయపరిచారు. రెండు వారాల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన బాధితురాలు మంగళవారం రాత్రి మరణించారు. చదవండి : కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top