ఇది నిజం మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం! రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Said Ready To Pay Any Price For Speaking Truth - Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ రోజు (శనివారం) ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి.. అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్‌ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. నిజం మాట్లాడినందుకు ఎంతటి మూల్యాన్ని చెల్లించేందుకైనా రెడీ అంటూ తనదైన శైలిలో బీజేపీకి కౌంటరిచ్చారు. అదీగాక శుక్రవారం సూరత్‌ సెషన్స్‌ కోర్టుని ఆశ్రయించినా.. రాహుల్‌కి ఊరట లభించలేదు.

ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు రాహుల్‌. తనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ బలవంతపు దాడులకు దిగుతోందన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.."హిందూస్తాన్‌ ప్రజల నాకు 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని ఇచ్చారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఇది నిజం మాట్లాడినందుకు మూల్యం. నేను నిజం మాట్లాడినందుకు ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా." అని తన అధికారిక నివాసం వెలుపల విలేకరులతో అన్నారు.

తన వస్తువులను జన్‌పథ్‌ 10లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలిస్తున్నట్లు రాహుల్‌ చెప్పారు. బంగ్లాను ఖాళీ చేసి వెళ్లేందుకు సోదరి ప్రియాంక గాంధీ రాహుల్‌కి సహాయం చేస్తూ కనిపించారు. కాగా, సూరత్‌ హైకోర్టులో సైతం రాహుల్‌కి చుక్కెదురు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ, ఇతర పార్టీలు దీన్ని ప్రజాస్వామ్యంపై దాడి అని ముక్త కంఠంతో నినదించాయి. కానీ బీజేపీ మాత్రం కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ..అతని పార్టీ న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తూ చట్టాన్ని అగౌరపరుస్తుందని ఆరోపణలు చేస్తోంది. 

(చదవండి: షిర్డి ఆలయం నుంచి నాణేలను బ్యాంకులు తీసుకోమన్నాయ్‌! ఎందుకంటే..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top