‘నిద్రలేని రాత్రులు’.. భావోద్వేగంలో రాహుల్ | Rahul Gandhi Praises Dedication Of Nurses, Shares Emotional Experience During Sonia Gandhi’s Hospitalization | Sakshi
Sakshi News home page

‘నిద్రలేని రాత్రులు’.. భావోద్వేగంలో రాహుల్

Mar 26 2026 9:30 AM | Updated on Mar 26 2026 10:13 AM

Rahul Gandhi recalls Kerala nurses dedication

కోళికోడ్: ‘లోకమంతా నిద్రపోతున్నా.. వారు మాత్రం రోగుల ప్రాణాలు కాపాడేందుకు మేల్కొనే ఉంటారు’ అంటూ కేరళ నర్సుల అంకితభావాన్ని కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తన తల్లి సోనియా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఒక కేరళ నర్సు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ రాహుల్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కోజికోడ్ బీచ్‌లో బుధవారం జరిగిన బహిరంగ సభకు రాహుల్ గాంధీ నేరుగా హాజరు కావాల్సి ఉంది. అయితే, సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు.

ఈ క్రమంలోనే రాహుల్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేరళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నారు. ‘నిన్న మా అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఒక కొడుకుగా నాకు చాలా ఆందోళనగా అనిపించింది. అందుకే ఆమె దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నిన్న రాత్రంతా ఆసుపత్రి గదిలో ఒక చిన్న సోఫాపై పడుకుని అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ గడిపాను. కానీ ఆ కష్ట సమయంలో నాకు ఒక కేరళ నర్సు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అని రాహుల్ తెలిపారు.

ప్రతి గంటకూ వచ్చి.. చిరునవ్వుతో..
ఆ నర్సు నిబద్ధతను రాహుల్‌ వివరిస్తూ.. ‘ఆమె ప్రతి గంటకూ గదిలోనికి వచ్చి అమ్మను పరీక్షించారు. చిరునవ్వుతో అమ్మ చేయి పట్టుకుని ఓదార్చారు. తెల్లవారుజామున నేను ఆమెను అడిగాను.. ‘మీరు అస్సలు నిద్రపోరా?’ అని.. దానికి ఆమె.. ‘లేదు, లోకమంతా నిద్రపోతున్నా మేము మేల్కొనే ఉంటాం, రోగులకు సేవ చేస్తాం’ అని సమాధానమిచ్చారు. కేవలం కేరళలోనే కాదు.. ఢిల్లీలో, దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా కేరళ మహిళలు ఇలాగే ప్రాణాలు కాపాడుతున్నారు’ అని రాహుల్ ప్రశంసల జల్లు కురిపించారు.

రాజకీయ జవాబుదారీతనంపై వ్యాఖ్యలు
2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను కాపాడే ఆరోగ్య కార్యకర్తలు ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు, రాజకీయ నాయకత్వం కూడా ప్రజలకు అంతే జవాబుదారీగా ఉండాలని రాహుల్ గుర్తు చేశారు. ఫ్రంట్‌లైన్ యోధుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ‘నెట్‌ఫ్లిక్స్’లో ‘బీటీఎన్‌’ పచ్చి నిజాలు?

Advertisement
 
Advertisement
Advertisement