ఇప్పటి వరకు ఎంతమంది నేతలపై అనర్హత వేటు పడిందో తెలుసా!

Rahul Gandhi Joins List Of Disqualification MPs And MLAs - Sakshi

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీపై లోకసభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌కి రెండేళ్లు జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన సభ్యత్వంపై వేటు పడింది. అయితే సూరత్‌ కోర్టు తాజా తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు  30 రోజుల గడువు  ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా మళ్లీ రాహుల్‌ అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.  

ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. అలా జైలు శిక్షపడి రాహుల్‌ గాంధీలా చట్ట సభ సభ్యుత్వాన్ని కోల్పోయిన నేతలు అనేకమంది ఉన్నారు. ఇలా గతంలో తమ సభ్యుత్వాన్ని కోల్పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిశీలిస్తే..

లాలూ ప్రసాద్ యాదవ్: రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2013లో కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లోక్ సభకు అనర్హుడయ్యాడు. ఐతే చట్టసభ సభ్యులను అనర్హత నుంచి రక్షించే నిబంధనను 2013లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత లోక్‌సభ నుంచి మొదటి అనర్హత అతనిది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. 

జే జయలలిత: 2014లో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడిన మొదటి సీఎంగా నిలిచారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది.

రషీద్ మసూద్: 2013లో, ఎంబీబీఎస్‌ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అర్హత కోల్పోయారు.

ఆజం ఖాన్: అక్టోబర్ 2022లో, 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు యుపి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.ఆ తర్వాత ఆయన్నురాష్ట్ర అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించి..ఎన్నికల సంఘం (ఈసీ) రాంపూర్ స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అబ్దుల్లా ఆజం ఖాన్: ఫిబ్రవరి 2023లో, ఆజం ఖాన్ కుమారుడు రాంపూర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ నుంచి రెండవసారి అనర్హుడయ్యాడు, కోర్టు అతనికి రెండు రోజుల శిక్ష విధించిన తర్వాత మొరాదాబాద్‌లోని ఛజ్‌లెట్ ప్రాంతంలో రోడ్డుకు సంబంధించిన 15 ఏళ్ల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. అదీగాక అంతకుముందు వయసు సంబంధించిన సర్టిఫికేట్‌ ఫోర్జరీ కేసులో కూడా రాంపూర్‌ కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. దీంతో ఫిబ్రవరి 2020లో ఆయనపై మరోసారి అనర్హత వేటు పడింది. 

అనిల్ కుమార్ సాహ్ని:
ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని చీటింగ్‌ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022 అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుడయ్యారు. ఆయన కుర్హానీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

విక్రమ్ సింగ్ సైనీ:
2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ అక్టోబర్ 2022 నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు అనర్హుడయ్యారు. సైనీ ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ప్రదీప్ చౌదరి:
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరిపై దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత జనవరి 2021లో హర్యానా అసెంబ్లీ నుంచి అనర్హత వేటు పడింది. ఆయన కలక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కుల్దీప్ సింగ్ సెంగార్:
అత్యాచారం కేసులో దోషిగా తేలిన కారణంగా కులదీప్ సింగ్ సెంగార్ ఫిబ్రవరి 2020లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఉన్నావ్‌లోని బంగార్‌మౌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సెంగార్‌ను గతంలో బీజేపీ బహిష్కరించింది.

అనంత్ సింగ్:
ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన నివాసం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలడంతో జూలై 2022లో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హుత వేటు పడింది. సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇదిలా ఉండగా..వాస్తవానికి సుప్రీం కోర్టు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీ చట్టం)లోని సెక్షన్ 8(4)ని కొట్టివేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 8(3)  ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి మూడు నెలల తర్వాత పార్లమెంట్‌ సభ్యుత్వం కోల్పోయి అనర్హత వేటు విధించడం జరుగుతుంది. అలాగే మూడు నెలల వ్యవధిలో సదరు వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా అప్పీలు దాఖలు చేసుకోవచ్చు.

ఐతే ఆసక్తికరంగా 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం దోషులుగా ఉన్న చట్టసభ సభ్యులను సభ నుంచి తక్షణం అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పుడు రాహుల్ గాంధీనే తన సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రికా సమావేశంలో ఆ ఆర్డినెన్స్‌ను చించివేయడం గమనార్హం.

(చదవండి: బ్రిటీష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ఎక్కువ ప్రమాదకరం: ఢిల్లీ సీఎం)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top